ఎన్నారైలకు సులభంగా శ్రీవారి దర్శనం.. ఇలా చేస్తే స‌రిపోతుంది!

  • ఎన్నారైలకు సుపథం మార్గంలో ప్రత్యేక దర్శన సౌకర్యం
  • ముందస్తు బుకింగ్ అవసరం లేదు.. ఒక్కొక్కరికి రూ.300 టికెట్
  • భారత్‌కు వచ్చిన 30 రోజుల్లోపు మాత్రమే అర్హత
  • దర్శనానికి ఒరిజినల్ పాస్‌పోర్టు, ఇమ్మిగ్రేషన్ స్టాంప్ తప్పనిసరి
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం అనేది కోట్లాది భక్తుల కల. దేశంలోనే కాకుండా విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారు, ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా భారతదేశానికి వచ్చిన ప్రతిసారీ తిరుమల యాత్రను తమ ప్రయాణంలో భాగంగా చేసుకుంటారు. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే భక్తుల సౌలభ్యం కోసం టీటీడీ ఎన్నారైలకు ప్రత్యేక దర్శన సౌకర్యాన్ని కల్పిస్తోంది.

ఎన్నారై భక్తులు తిరుమలలోని సుపథం మార్గం ద్వారా నేరుగా శ్రీవారి దర్శనానికి వెళ్లవచ్చు. ఈ దర్శనానికి ముందస్తుగా ఆన్‌లైన్ బుకింగ్ అవసరం లేదు. అవసరమైన డాక్యుమెంట్లను చూపించి ఒక్కొక్కరికి రూ.300 చెల్లించి టికెట్ పొందవచ్చు. సాధారణంగా ఈ ప్రత్యేక దర్శనం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. భక్తుల రద్దీని బట్టి సమయాల్లో మార్పులు ఉండొచ్చు.

ఈ దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలి. అలాగే, భారత్‌కు వచ్చిన తేదీ నుంచి 30 రోజుల లోపు మాత్రమే ఈ ప్రత్యేక ఎన్నారై దర్శనానికి అర్హులు. దర్శన సమయంలో ఒరిజినల్ పాస్‌పోర్టు తప్పనిసరి. పాస్‌పోర్టులోని ఇమ్మిగ్రేషన్ అరైవల్ స్టాంప్ ఆధారంగా అధికారులు ధ్రువీకరిస్తారు. ఓవర్‌సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) లేదా పీఐఓ కార్డు ఉన్నవారు వాటిని కూడా చూపించాలి.

ఎన్నారై భక్తులతో పాటు వచ్చిన స్థానిక కుటుంబ సభ్యులకు సుపథం మార్గం ద్వారా దర్శనం అనుమతి ఉండదు. వారు సాధారణ భక్తుల్లాగానే ఆన్‌లైన్‌లో రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ బుక్ చేసుకోవాలి. దర్శనం మాత్రమే కాకుండా, తిరుమలలో వసతి, ఆర్జిత సేవల కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఆన్‌లైన్ బుకింగ్ తప్పనిసరి.

తిరుమలలో ఎప్పుడూ భారీ రద్దీ ఉండటంతో విదేశాల నుంచి వచ్చే భక్తులు కనీసం 60 రోజుల ముందుగానే వసతి బుక్ చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి ఆర్జిత సేవలకు లక్కీడిప్ విధానం అమలులో ఉంది. ఈ సేవల కోసం పాస్‌పోర్టు వివరాలు ఇవ్వాలి. దర్శనం లేదా వసతి సమయంలో బుకింగ్‌లో ఉపయోగించిన అసలు పాస్‌పోర్టును చూపించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు పాటిస్తే, ఎన్నారై భక్తులు ప్రశాంతంగా, సులభంగా తిరుమల శ్రీవారి దర్శనాన్ని పూర్తి చేసుకోవచ్చు.


More Telugu News