క్రికెట‌ర్ల‌ నాన్‌-స్టాప్ తాగుడు.. స్టోక్స్ జట్టుపై ఈసీబీ విచారణకు రెడీ!

  • యాషెస్ పరాజయాల మధ్య ఇంగ్లాండ్ జట్టుపై మద్యం ఆరోపణలు
  • నూసా విరామంలో మద్యం ఆరోపణలపై విచారణకు సిద్ధమైన ఈసీబీ 
  • అతిగా మద్యం సేవించడం అంతర్జాతీయ జట్టుకు తగదన్న రాబ్ కీ
  • బెథెల్, బ్రూక్‌లకు గతంలో అనధికార హెచ్చరికలు
  • 2011 తర్వాత ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్ ఒక్క టెస్టు కూడా గెలవని వైనం
యాషెస్ సిరీస్‌లో మరోసారి నిరాశాజనక ప్రదర్శనతో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంటోంది. అడిలైడ్‌లో జరిగిన మూడో టెస్టులో 82 పరుగుల తేడాతో ఓడిపోయిన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో వరుసగా నాలుగోసారి యాషెస్ సిరీస్ కోల్పోయింది. అయితే, ఈ పరాజయాలకంటే ఎక్కువగా ఇప్పుడు సిరీస్ విరామంలో ఆటగాళ్ల ప్రవర్తన చర్చకు వస్తోంది.

మూడో టెస్టుకు ముందు ఇంగ్లాండ్ జట్టు నాలుగు రోజుల పాటు నూసా అనే విహార కేంద్రానికి వెళ్లింది. ఈ విరామం అప్పట్లోనే ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు, నిపుణుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. తాజాగా ఆ విరామంలో ఆటగాళ్లు నాన్‌-స్టాప్‌గా మద్యం సేవించారన్న ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ఈ వ్యవహారంపై విచారణకు సిద్ధమైంది.

ఇంగ్లాండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ మాట్లాడుతూ, “అంతర్జాతీయ జట్టు స్థాయిలో అతిగా మద్యం సేవించడం అస్సలు ఆమోదయోగ్యం కాదు. అలాంటి ఆరోపణలు నిజమైతే తప్పకుండా విచారిస్తాం. అయితే, ఇప్పటివరకు నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆటగాళ్లు మంచి ప్రవర్తనే చూపించారు” అని స్పష్టం చేశారు. జట్టు సంస్కృతిలో మద్యం పూర్తిగా నిషేధం కాకపోయినా అది ‘స్టాగ్ పార్టీ’ తరహాలో మారితే మాత్రం సహించబోమని హెచ్చరించారు.

కాగా జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్‌లకు న్యూజిలాండ్ పర్యటన సమయంలో బార్‌లో మద్యం తాగిన ఘటనపై ముందస్తు హెచ్చరికలు ఇచ్చినట్లు రాబ్ కీ వెల్లడించారు. డిన్నర్ సమయంలో ఒక గ్లాస్ వైన్ వరకు పరవాలేదని, దాన్ని మించితే అనవసరమని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే.. బెన్ డకెట్ మత్తులో ఉన్నట్లు క‌నిపించిన‌ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఆ వీడియో ఆస్ట్రేలియాలోనే చిత్రీకరించబడిందా? అనే విషయం తెలియాల్సి ఉంది.

ఇక‌, ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. 2011లో ఆండ్రూ స్ట్రాస్ నాయకత్వంలో చివరిసారి యాషెస్ గెలిచిన ఇంగ్లాండ్, ఆ తర్వాత అక్కడ 18 టెస్టులు ఆడగా 16 ఓటములు, 2 డ్రాల‌తో స‌రిపెట్టుకుంది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న యాషెస్‌ సిరీస్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్ కోల్పోయింది. ఇప్పుడు కనీసం పరువు నిలబెట్టుకోవాలన్నా స్టోక్స్ సేన గట్టిగా పోరాడాల్సిందే. లేకపోతే నాలుగోసారి 5-0 వైట్‌వాష్ ముప్పు తప్పదు.


More Telugu News