ఇన్‌స్టామార్ట్ ఆర్డర్స్ 2025లో ఆసక్తికరం: ఐఫోన్ల కోసం లక్షలు ఖర్చు చేసిన హైదరాబాదీ, రూ.68 వేలు టిప్ ఇచ్చిన బెంగళూరు వాసి

  • వార్షిక నివేదికను విడుదల చేసిన ఇన్‌స్టామార్ట్
  • రూ.10 వెచ్చించి ప్రింటవుట్ తెప్పించిన బెంగళూరువాసి
  • చెన్నైకి చెందిన వ్యక్తి కండోమ్స్ కోసం రూ.1 లక్ష ఖర్చు చేశాడు
  • ఏడాదిలో 368 సార్లు కరివేపాకు ఆర్డర్ పెట్టిన కొచ్చి వ్యక్తి
హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి నూతన మోడల్ ఐఫోన్ల కోసం 2025 సంవత్సరంలో రూ.4.3 లక్షలు ఖర్చు చేశాడని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీకి చెందిన క్విక్ కామర్స్ విభాగం ఇన్‌స్టామార్ట్ విడుదల చేసిన వార్షిక నివేదికలో వెల్లడించింది. ఈ నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా ఎక్కువగా ఆర్డర్ చేసిన జాబితాలో కరివేపాకు ఉండటం విశేషం.

ఈ నివేదిక ప్రకారం, బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి రూ.10 వెచ్చించి ప్రింటవుట్ తెప్పించుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన యువకుడు కొత్త ఐఫోన్ మోడల్స్ కోసం రూ.4 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేశాడు. వివిధ కొనుగోళ్ల కోసం ఒక వ్యక్తి రూ.22 లక్షలు ఖర్చు చేయగా, ముంబైకి చెందిన ఒక వ్యక్తి రూ.15.16 లక్షలు విలువ చేసే బంగారం గొలుసు కొనుగోలు చేశాడు. చెన్నైకి చెందిన ఒక వ్యక్తి కండోమ్స్ కోసం ఈ ఏడాది రూ. 1 లక్ష ఖర్చు చేశాడు.

దేశవ్యాప్తంగా ఆర్డర్ చేసిన ఆహార పదార్థాలలో కరివేపాకు, పెరుగు, గుడ్లు, పాలు, అరటిపండ్లు ఉన్నాయి. కొచ్చికి చెందిన ఒక వ్యక్తి 368 సార్లు కరివేపాకు కోసం ఆర్డర్ పెట్టాడు. బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి డెలివరీ బాయ్‌కి రూ.68,600 టిప్‌గా చెల్లించడం గమనార్హం. ప్రతిరోజు ఉదయం 7 నుంచి 11 వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య ఎక్కువ ఆర్డర్లు వచ్చినట్లు నివేదిక పేర్కొంది.


More Telugu News