అమెరికాలో భారీగా తగ్గనున్న మందుల ధరలు.. ట్రంప్ సంచలన ప్రకటన

  • ఔషధాల ధరలను భారీగా తగ్గించనున్నట్టు ట్రంప్ ప్రకటన
  • ప్రపంచంలో అత్యంత తక్కువ ధరకే అమెరికన్లకు మందులు అందించే ప్లాన్
  • ఫార్మా కంపెనీలతో 300 నుంచి 700 శాతం వరకు ధరల తగ్గింపునకు ఒప్పందాలు
  • ఈ విధానం భారత జనరిక్ మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశం
అమెరికాలో ఔషధాల ధరలను భారీగా తగ్గిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇకపై ప్రపంచంలో ఏ దేశంలోనైతే అత్యల్ప ధరకు మందులు లభిస్తాయో, అదే ధరకు అమెరికన్లకు కూడా అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ ప్రైసింగ్’ విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయం అమెరికాకు మందులు ఎగుమతి చేసే భారత జనరిక్ ఫార్మా పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఈ చారిత్రక ప్రకటన సందర్భంగా హెచ్‌హెచ్‌ఎస్ సెక్రటరీ రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్, వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్, పలువురు ఉన్నతాధికారులు, ప్రముఖ ఫార్మా కంపెనీల సీఈవోలు ట్రంప్ వెంట ఉన్నారు. దశాబ్దాలుగా అమెరికన్లు ప్రపంచంలోనే అత్యధిక ధరలు చెల్లించాల్సి వస్తోందని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. "ఇకపై మీకు ప్రపంచంలోనే అత్యల్ప ధర లభిస్తుంది" అని ఆయన హామీ ఇచ్చారు.

ప్రముఖ ఔషధ కంపెనీలతో కుదిరిన ఒప్పందాల ప్రకారం కీలకమైన మందుల ధరలు 300 నుంచి 700 శాతం వరకు తగ్గుతాయని ట్రంప్ వివరించారు. విదేశీ ప్రభుత్వాలు ధరలను అదుపులో పెట్టేందుకు అవసరమైతే టారిఫ్‌లను కూడా ఉపయోగిస్తామని హెచ్చరించారు. "టారిఫ్‌ల వినియోగం లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు" అని ఆయన స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా అమెరికాలోనే ఫార్మాస్యూటికల్ తయారీని ప్రోత్సహించనున్నట్టు తెలిపారు.

ప్రపంచంలోనే అతిపెద్ద జనరిక్ మందుల తయారీదారుగా ఉన్న భారత్, అమెరికా మార్కెట్‌కు అతిపెద్ద సరఫరాదారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులకు అవసరమైన మందులను తక్కువ ధరకే అందిస్తోంది. అమెరికా ఇప్పుడు ప్రపంచ ధరలతో ధరలను పోల్చాలని నిర్ణయించడంతో, భారత ఫార్మా కంపెనీలు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి.


More Telugu News