ప్రారంభమైన హైదరాబాద్ బుక్ ఫెయిర్

  • హైదరాబాద్‌లో 38వ పుస్తక ప్రదర్శన ప్రారంభం
  • పుస్తకాలు చదవకపోవడం వల్లే గుణాలు కల్తీ అవుతున్నాయన్న మంత్రి జూపల్లి
  • బుక్ ఫెయిర్‌కు సాంస్కృతిక శాఖ నుంచి రూ.3 కోట్లు మంజూరు చేస్తామని హామీ
  • జిల్లా కేంద్రాల్లోనూ పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సూచన
హైదరాబాద్‌లో 38వ జాతీయ పుస్తక ప్రదర్శన అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రసంగిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పుస్తక పఠనం అలవాటు తగ్గిపోవడం వల్లే వ్యక్తుల్లో సద్గుణాలు కనుమరుగవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఇల్లు ఒక గ్రంథాలయంగా రూపుదిద్దుకున్నప్పుడే సమాజం ప్రగతి పథంలో పయనిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు సాంస్కృతిక శాఖ తరఫున రూ.3 కోట్ల నిధులు మంజూరు చేస్తామని మంత్రి జూపల్లి హామీ ఇచ్చారు. పుస్తక ప్రదర్శనలను కేవలం నగరాలకే పరిమితం చేయకుండా, జిల్లా కేంద్రాల్లోనూ నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. గ్రామాల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు సర్పంచ్‌లు, స్థానిక నాయకులు చొరవ చూపాలని పిలుపునిచ్చారు. పుస్తక పఠనం ద్వారా విషయాలను లోతుగా అర్థం చేసుకునే విజ్ఞానం లభిస్తుందని వివరించారు.

బుక్‌ఫెయిర్‌ ప్రాంగణానికి ప్రజాకవి అందెశ్రీ పేరును పెట్టడం అభినందనీయమని కొనియాడారు. అనిశెట్టి రజిత పేరును ప్రధాన వేదికకు, సాహితీవేత్త కొంపల్లి వెంకట్‌గౌడ్‌ పేరును పుస్తకావిష్కరణల వేదికకు నామకరణం చేయడం సంతోషకరమన్నారు. ప్రొఫెసర్‌ ఎస్‌వీ రామారావు పేరుతో రైటర్స్‌ స్టాల్‌, స్వేచ్ఛ ఒటార్కర్‌ పేరుతో మీడియా స్టాల్స్‌ ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ, పుస్తకాలను అధ్యయనం చేసేవారు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు. పుస్తక పఠనం ఆత్మ విమర్శకు దారితీస్తుందని, తద్వారా విజయం సునాయాసమవుతుందని తెలిపారు. బాల్యం నుంచే పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేస్తే వారి భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ బుక్‌ఫెయిర్‌ ప్రాంగణంలో మొత్తం 367 స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. 


More Telugu News