గవర్నర్ ను కలవడానికి జగన్ తో పాటు 40 మందికి మాత్రమే అనుమతి

  • ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన
  • గవర్నర్‌కు కోటి సంతకాల పత్రాలను సమర్పించనున్న జగన్
  • అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత కాలినడకన లోక్ భవన్ కు
ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ఉద్యమం కీలక దశకు చేరుకుంది. ఈ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల పత్రాలను గవర్నర్‌కు అందజేసేందుకు ఆయన కాసేపట్లో లోక్ భవన్‌కు వెళ్లనున్నారు. అయితే, జగన్‌తో పాటు 40 మంది వైసీపీ నేతలకు మాత్రమే గవర్నర్‌ను కలిసేందుకు అనుమతి లభించింది.

ఇప్పటికే తన తాడేపల్లి నివాసం నుంచి జగన్ పలువురు ముఖ్య నేతలతో కలిసి విజయవాడకు బయల్దేరారు. బందర్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం, ఆయన పార్టీ శ్రేణులతో కలిసి కాలినడకన లోక్‌భవన్‌కు వెళతారు. పోలీసుల నిబంధనల మేరకు 40 మంది నేతల బృందం ఆయన వెంట వెళ్లనుంది. గవర్నర్‌తో భేటీ ముగిసిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడనున్నారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుత ప్రభుత్వం వాటి నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసి, ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. దీనికి వ్యతిరేకంగా అక్టోబర్‌లో ‘రచ్చబండ’ కార్యక్రమం ద్వారా కోటి సంతకాల సేకరణను ప్రారంభించారు. ప్రజల నుంచి సేకరించిన ఈ సంతకాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా, ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా వైసీపీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.


More Telugu News