Hema: నా జీవితంలో ఆ బాధను ఎప్పటికీ మర్చిపోలేను: హేమ
గత రెండేళ్లుగా తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలు, న్యాయపోరాటం, తాను ఎదుర్కొన్న మానసిక క్షోభపై సీనియర్ సినీ నటి హేమ భావోద్వేగంగా స్పందించారు. 2024 మే నెలలో బెంగళూరు ఎలక్ట్రానిక్స్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామ్ హౌస్‌పై జరిగిన పోలీసు దాడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సమయంలో హేమతో పాటు పలువురు ప్రముఖుల పేర్లు ఛార్జ్ షీట్లో చేర్చడంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
"నేను ఒక సెలబ్రిటీని కావడం వల్లే నాపై లేనిపోని ప్రచారం చేశారు. నేను ఏ తప్పూ చేయలేదని మొత్తుకున్నా ఎవరూ నమ్మలేదు. కొన్ని మీడియా సంస్థలు తనపై ఆరోపణలను హైలైట్ చేసినంతగా, నేను నిర్దోషినని కోర్టు తేల్చిన విషయాన్ని ప్రచారం చేయలేదు" అని ఆమె విమర్శించారు.
సుమారు వెయ్యి పేజీల ఛార్జ్ షీట్, నెలల తరబడి సాగిన విచారణ అనంతరం 2025 జనవరి 2న బెంగళూరు కోర్టు హేమ డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పు తన నిజాయతీకి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. ఆ సమయంలో తాను అనుభవించిన మానసిక ఒత్తిడి వర్ణనాతీతమని, కేవలం కోర్టు తీర్పు తర్వాతే తనకు గౌరవం దక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు.
"డ్రగ్స్ కేసులో అరెస్టయినంత మాత్రాన లేదా జైలుకు వెళ్లినంత మాత్రాన వారు నేరం చేసినట్లు కాదు. విచారణ పూర్తయి, నిజానిజాలు తేలే వరకు ఎవరినీ దోషులుగా ముద్ర వేయడం సరైంది కాదు" అని ఆమె స్పష్టం చేశారు.