అమెరికాలో దారుణం.. స్పృహలో లేని యువతిపై భారత సంతతి డ్రైవర్ అఘాయిత్యం!

  • అమెరికాలో భారత సంతతి క్యాబ్ డ్రైవర్ అరెస్ట్
  • స్పృహలో లేని ప్రయాణికురాలిపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు
  • నేరం అంగీకరించని నిందితుడు.. 5 లక్షల డాలర్ల పూచీక‌త్తుపై బెయిల్ మంజూరు
  • మరికొందరు బాధితులు ఉండే అవకాశం ఉందని పోలీసుల అనుమానం
అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ దారుణానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో స్పృహలో లేకుండా ఉన్న ఓ యువతిపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కాలిఫోర్నియాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వెంచురా కౌంటీ షెరీఫ్ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. బేకర్స్‌ఫీల్డ్‌కు చెందిన సిమ్రన్‌జిత్ సింగ్ సెఖోన్ (35) క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నవంబర్ 27న తెల్లవారుజామున 1 గంట సమయంలో 21 ఏళ్ల యువతి థౌజండ్ ఓక్స్‌లోని ఓ బార్ నుంచి కమరిల్లోలోని తన ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది. అప్పటికే ఆమె తీవ్రమైన మత్తులో ఉంది.

మార్గమధ్యంలో నిద్రలోకి జారుకున్న ఆమెను గమ్యస్థానానికి చేర్చాల్సిన సెఖోన్, ట్రిప్ పూర్తయినట్లు యాప్‌లో చూపించాడు. ఆ తర్వాత, స్పృహలో లేని ఆమెను కమరిల్లో వీధుల్లో కారులో తిప్పుతూ లైంగిక దాడికి పాల్పడ్డాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై నవంబర్‌లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఈ నెల‌ 15న నిందితుడిని అరెస్ట్ చేశారు.

నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, తాను నేరం చేయలేదని వాదించాడు. కోర్టు అతనికి 5 లక్షల డాలర్ల పూచీక‌త్తుపై బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ ఈ నెల‌ 29న జరగనుంది. అయితే, సెఖోన్ ఏ రైడ్‌షేర్ సంస్థ తరఫున పనిచేస్తున్నాడనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. ఈ ఘటన నేపథ్యంలో నిందితుడి వల్ల ఇంకా ఎవరైనా బాధింప‌బ‌డి ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.


More Telugu News