పది నెలల్లో 8 యుద్ధాలు ఆపాను.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్

  • దేశాన్ని గందరగోళంగా మార్చి బైడెన్ తనకు అప్పగించారన్న ట్రంప్
  • టారిఫ్‌ల వల్లే అమెరికా ఆర్థిక వ్యవస్థకు మేలు జరిగిందని వ్యాఖ్య
  • ట్రంప్ ఆర్థిక విధానాలకు 33 శాతమే ప్రజల ఆమోదం
తాను అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ఎనిమిది యుద్ధాలను ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. టారిఫ్‌ల (సుంకాలు) వల్లే ఇది సాధ్యమైందని, ఇంగ్లిష్‌లో తనకు అత్యంత ఇష్టమైన పదం కూడా అదేనని పునరుద్ఘాటించారు. తన ముందు అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ దేశాన్ని గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టి తన చేతుల్లో పెట్టారని ఆయన తీవ్రంగా విమర్శించారు.

దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన 79 ఏళ్ల ట్రంప్ తన ప్రభుత్వ 2026 ఎజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "నేను అమెరికా బలాన్ని పునరుద్ధరించాను. పది నెలల్లో ఎనిమిది యుద్ధాలను పరిష్కరించాను. ఇరాన్ అణు ముప్పును నాశనం చేశాను. గాజాలో యుద్ధాన్ని ముగించి మూడు వేల ఏళ్లలో తొలిసారిగా శాంతిని తీసుకొచ్చాను. బందీలను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చాను" అని చెప్పుకొచ్చారు.

ట్రంప్ వాణిజ్య విధానాల వల్ల అమెరికాలో ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ ద్రవ్యోల్బణం గురించి ఆయన ప్రస్తావించలేదు. కెనడా, మెక్సికో, భారత్ వంటి దేశాలపై విధించిన టారిఫ్‌ల వల్లే అమెరికా ఆర్థిక వ్యవస్థకు మేలు జరిగిందని సమర్థించుకున్నారు. "టారిఫ్‌ల వల్ల మేం అనుకున్నదానికంటే చాలా ఎక్కువ డబ్బు సంపాదించాం" అని తెలిపారు.

బైడెన్ హయాంలోని అధిక ద్రవ్యోల్బణాన్ని ప్రచారాస్త్రంగా వాడుకుని రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కిన ట్రంప్ ఇప్పుడు అదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆయన ఆర్థిక విధానాలను కేవలం 33 శాతం అమెరికన్లు మాత్రమే ఆమోదిస్తున్నారని తాజాగా రాయిటర్స్/ఇప్సోస్ పోల్ వెల్లడించింది. అయితే, ఈ విషయాలపై వివరణ ఇవ్వకుండా.. వలసలు, ద్రవ్యోల్బణం వంటి సమస్యలకు బైడెన్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. "నేను అధికారం చేపట్టే నాటికి దేశం గందరగోళంలో ఉంది. ఇప్పుడు దాన్ని నేను సరిదిద్దుతున్నాను" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.


More Telugu News