జర్మనీలో బీఎండబ్ల్యూ ప్లాంట్ సందర్శన.. భారత తయారీ రంగంపై రాహుల్ గాంధీ ఆందోళన

  • బీఎండబ్ల్యూ ప్లాంట్‌లో మేడ్ ఇన్ ఇండియా బైక్
  • గర్వంగా ఉందన్న రాహుల్ గాంధీ
  • బలమైన ఆర్థిక వ్యవస్థకు తయారీ రంగమే వెన్నెముక అని వ్యాఖ్య
కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ వారం జర్మనీలోని మ్యూనిచ్‌లో ఉన్న ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ బీఎండబ్ల్యూ ప్లాంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అత్యాధునిక కార్ల తయారీ విధానాన్ని దగ్గరుండి పరిశీలించారు. అనంతరం, భారతదేశంలో తయారీ రంగం క్షీణిస్తుండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ పర్యటనకు సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. "ఏ దేశ విజయానికైనా ఉత్పత్తి చాలా కీలకం. భారతదేశం ఉత్పత్తిని ప్రారంభించాల్సిన అవసరం ఉంది. మన తయారీ రంగం పెరగాల్సింది పోయి క్షీణిస్తోంది" అని ఆయన పేర్కొన్నారు. ప్లాంట్‌లో ఆయన ఎం-సిరీస్, ఎలక్ట్రిక్ బైక్‌లు, రోల్స్ రాయిస్ వంటి పలు వాహనాలను పరిశీలించారు.

ముఖ్యంగా, తమిళనాడులోని హోసూర్‌లో టీవీఎస్ భాగస్వామ్యంతో బీఎండబ్ల్యూ అభివృద్ధి చేసిన జీ450జీఎస్ మోటార్‌సైకిల్‌ను చూసి రాహుల్ సంతోషం వ్యక్తం చేశారు. "భారత ఇంజినీరింగ్ ప్రతిభను ఇక్కడ ప్రదర్శనలో చూడటం గర్వంగా ఉంది. ఇక్కడ భారత జెండా ఎగరడం చూడటం సంతోషాన్నిచ్చింది" అని ఆయన వ్యాఖ్యానించారు.

"బలమైన ఆర్థిక వ్యవస్థలకు తయారీ రంగమే వెన్నెముక. మన దేశంలో వృద్ధిని వేగవంతం చేయాలంటే, మనం ఎక్కువగా ఉత్పత్తి చేయాలి. నాణ్యమైన ఉద్యోగాలను పెద్ద ఎత్తున సృష్టించాలి" అని రాహుల్ గాంధీ తెలిపారు. పర్యటనలో భాగంగా ఆయన ఒక బీఎండబ్ల్యూ కారు నడపడంతో పాటు, అక్కడి భారతీయులతో ముచ్చటించారు. ఇటీవల బీహార్‌లో జరిగిన "ఓటర్ అధికార్ యాత్ర"లో కూడా రాహుల్ మోటార్‌సైకిల్‌పై పర్యటించిన విషయం తెలిసిందే.


More Telugu News