ఐపీఎల్ 2026 షెడ్యూల్ ఖరారు.. మార్చి 26 నుంచి మెగా టోర్నీ!

  • అబుదాబిలో జరగనున్న ఆటగాళ్ల మినీ వేలం
  • ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌కు రికార్డు ధర పలికే అవకాశం
  • డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీ హోం గ్రౌండ్‌పై వీడని అనిశ్చితి
  • వేలంలో 77 ఖాళీల కోసం 359 మంది ఆటగాళ్ల పోటీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. 2026 సీజన్‌ను మార్చి 26 నుంచి మే 31 వరకు నిర్వహించనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఫ్రాంచైజీలకు తెలియజేసింది. అబుదాబిలో నేడు (మంగళవారం) జరగనున్న ఆటగాళ్ల మినీ వేలానికి ముందు జరిగిన సమావేశంలో ఐపీఎల్ సీడీవో హేమంగ్ అమిన్ ఈ వివరాలు వెల్లడించినట్టు ‘క్రిక్‌బజ్’ తన కథనంలో పేర్కొంది.

డిఫెండింగ్ చాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తొలి మ్యాచ్‌తో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. అయితే, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు జరుగుతాయా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. గత టైటిల్ విజయోత్సవాల సమయంలో జరిగిన తొక్కిసలాట కారణంగా స్టేడియం లభ్యతపై అనిశ్చితి నెలకొంది. భద్రతా ప్రమాణాలు పాటిస్తేనే మ్యాచ్‌లు నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.

నేడు అబుదాబిలోని ఎతిహాద్ ఎరీనాలో జరగనున్న ఈ వేలంలో 10 ఫ్రాంచైజీలు పాల్గొననున్నాయి. మొత్తం 77 స్లాట్‌ల కోసం 359 మంది ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. వీరిలో 31 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) అత్యధికంగా 13 స్లాట్‌లను, సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) 10 స్లాట్‌లను భర్తీ చేసుకోవాల్సి ఉంది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ ఈ వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాడని, అతని కోసం రూ. 25 కోట్లకు పైగా ధర పలికే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. లియామ్ లివింగ్‌స్టోన్, రవి బిష్ణోయ్ వంటి ఆటగాళ్లపై కూడా ఫ్రాంచైజీలు భారీగా ఖర్చు చేసే అవకాశం ఉంది.


More Telugu News