గాడిన పడుతున్న ఇండిగో సేవలు.. నేడు 1950 విమానాలు

  • సాధారణ స్థితికి చేరుకుంటున్న ఇండిగో కార్యకలాపాలు
  • నేడు 1950 విమాన సర్వీసులు నడపడమే లక్ష్యమ‌ని ప్ర‌క‌ట‌న‌
  • ఇండిగోపై నిఘా పెట్టిన డీజీసీఏ ప్రత్యేక బృందం
గతవారం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. కార్యకలాపాలను పునరుద్ధరిస్తున్నామని, ఈరోజు 1,950కి పైగా విమానాలను నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించింది. ఈ సర్వీసుల ద్వారా సుమారు 3 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చనున్నట్లు తెలిపింది.

గత కొన్ని రోజులుగా కార్యకలాపాలు మెరుగుపడ్డాయని, ఈ నెల‌ 9 నుంచి సేవలు స్థిరంగా కొనసాగుతున్నాయని కంపెనీ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. గత మూడు రోజులుగా విమానాల షెడ్యూల్ విశ్వసనీయంగా ఉందని, కేవలం వాతావరణం, సాంకేతిక కారణాల వల్లే కొన్ని సర్వీసులు రద్దయ్యాయని వివరించారు. సమయపాలనలో మళ్లీ మెరుగైన ప్రమాణాలను అందుకున్నామని పేర్కొన్నారు.

ఈ నెల‌ 3 నుంచి 5వ తేదీ వరకు వేలాది విమానాలు రద్దు కావడం, ఆలస్యం అవడంతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ అంతరాయాల వల్ల ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఇండిగో ఛైర్మన్ విక్రమ్ సింగ్ మెహతా క్షమాపణ చెప్పారు. ఈ వైఫల్యానికి గల మూల కారణాలను గుర్తించేందుకు బయటి సాంకేతిక నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే... ఇండిగో కార్యకలాపాలను నిశితంగా పరిశీలించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) 8 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలోని ఇద్దరు అధికారులు ఇండిగో కార్పొరేట్ కార్యాలయంలో ఉండి రోజువారీ ప్రక్రియలను పర్యవేక్షిస్తారు.


More Telugu News