కశ్మీర్‌లో చైనా జాతీయుడి అరెస్ట్.. గూఢచర్యం కోణంలో దర్యాప్తు

  • వీసా నిబంధనలు ఉల్లంఘించి కశ్మీర్‌లో పర్యటన
  • శ్రీనగర్‌లో చైనా జాతీయుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు
  • కీలక సమాచారం కోసం ఫోరెన్సిక్‌కు మొబైల్ ఫోన్ 
వీసా నిబంధనలను ఉల్లంఘించి, ఎలాంటి అనుమతి లేకుండా కశ్మీర్, లడఖ్  ‌లలోని అత్యంత కీలకమైన, సున్నితమైన ప్రాంతాల్లో పర్యటించిన చైనా జాతీయుడిని శ్రీనగర్‌లో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. దేశ భద్రతకు సంబంధించిన సున్నిత సమాచారాన్ని ఏమైనా లీక్ చేశాడా? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

వివరాల్లోకి వెళితే, హూ కాంగ్‌తాయ్ (29) అనే చైనా పౌరుడు నవంబర్ 19న టూరిస్ట్ వీసాపై ఢిల్లీకి వచ్చాడు. నిబంధనల ప్రకారం వారణాసి, ఆగ్రా, జైపూర్, గయ వంటి కొన్ని బౌద్ధ క్షేత్రాలను మాత్రమే అతను సందర్శించాలి. కానీ అతడు ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO)లో నమోదు చేసుకోకుండానే లడఖ్‌లోని లేహ్, జన్స్కర్‌తో పాటు కశ్మీర్ లోయలోని పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో పర్యటించాడు. జన్స్కర్‌లో మూడు రోజుల పాటు ఉండి, స్థానిక బౌద్ధారామాలతో పాటు వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించాడు.

దక్షిణ కశ్మీర్‌లోని ఆర్మీ విక్టర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్‌కు సమీపంలో ఉన్న అవంతిపుర బౌద్ధ శిథిలాలతో పాటు హజ్రత్‌బల్ దర్గా, శంకరాచార్య హిల్, దాల్ సరస్సు వంటి ప్రాంతాల్లో అతడి కదలికలు అనుమానాలకు తావిచ్చాయి. భారత్‌కు వచ్చిన వెంటనే బహిరంగ మార్కెట్‌లో ఒక ఇండియన్ సిమ్ కార్డును కూడా సంపాదించడం గమనార్హం. అతడి ఫోన్‌లోని బ్రౌజింగ్ హిస్టరీలో సీఆర్పీఎఫ్ మోహరింపు, ఆర్టికల్ 370 రద్దు వంటి అంశాల గురించి వెతికినట్లు అధికారులు గుర్తించారు.

విచారణలో తాను అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో ఫిజిక్స్ చదివానని, గత తొమ్మిదేళ్లుగా అక్కడే ఉంటున్నానని హూ కాంగ్‌తాయ్ తెలిపాడు. తనకు ప్రయాణాలంటే ఇష్టమని, వీసా నిబంధనల ఉల్లంఘన గురించి తనకు తెలియదని చెబుతున్నాడు. అతడిని ప్రస్తుతం శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్ సమీపంలోని బుద్గాం జిల్లా హుమ్హామా పోలీస్ పోస్టులో విచారిస్తున్నారు. అతడి పర్యటన వెనుక అసలు ఉద్దేశాన్ని రాబట్టేందుకు భద్రతా ఏజెన్సీలు ప్రయత్నిస్తున్నాయి.


More Telugu News