Netflix: వినోద రంగంలో అతిపెద్ద డీల్... నెట్‌ఫ్లిక్స్ చేతికి వార్నర్ బ్రదర్స్

Netflix Acquires Warner Bros Discovery in Massive Deal
  • వార్నర్ బ్రదర్స్‌ను కొనుగోలు చేసిన నెట్‌ఫ్లిక్స్
  • సుమారు రూ.7.43 లక్షల కోట్ల విలువైన ఒప్పందం
  • నెట్‌ఫ్లిక్స్‌లోకి రానున్న గేమ్ ఆఫ్ థ్రోన్స్, హ్యారీ పాటర్
  • యూజర్లకు అందుబాటులోకి భారీ కంటెంట్ లైబ్రరీ
వినోద ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ, ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీకి చెందిన స్టూడియోలు, స్ట్రీమింగ్ యూనిట్‌ను కొనుగోలు చేసేందుకు భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ ఏకంగా 82.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ.7.43 లక్షల కోట్లు) కావడం గమనార్హం. ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఒప్పందంగా నిలవనుంది.

ఒక్కో వార్నర్ బ్రదర్స్ షేరుకు 27.75 డాలర్ల చొప్పున వెచ్చించి నెట్‌ఫ్లిక్స్ ఈ కొనుగోలు చేపడుతోంది. సీఎన్ఎన్, టీబీఎస్ వంటి కేబుల్ ఛానళ్లలో వార్నర్ బ్రదర్స్ యాజమాన్యం చేపట్టాల్సిన కొన్ని మార్పులు పూర్తయ్యాక 2026 మూడో త్రైమాసికంలో ఈ డీల్ అధికారికంగా ఖరారు కానుంది. ఇప్పటివరకు సొంతంగా పెద్ద స్టూడియోలు లేకుండా, ఇతర సంస్థల నుంచి కంటెంట్ లైసెన్స్ తీసుకుంటూ ఎదిగిన నెట్‌ఫ్లిక్స్, ఇంత భారీ స్థాయిలో కొనుగోలు చేపట్టడం ఇదే మొదటిసారి.

ఈ ఒప్పందంతో హెచ్‌బీఓ నెట్‌వర్క్‌తో పాటు 'గేమ్ ఆఫ్ థ్రోన్స్', 'ది లాస్ట్ ఆఫ్ అస్', 'సక్సెషన్' వంటి ప్రపంచ ప్రఖ్యాత సిరీస్‌ల హక్కులు నెట్‌ఫ్లిక్స్ సొంతమవుతాయి. అంతేకాకుండా 'హ్యారీ పాటర్', 'ఫ్రెండ్స్', 'ది డార్క్ నైట్' వంటి ఎన్నో క్లాసిక్ సినిమాలు, సిరీస్ లు... డీసీ కామిక్స్ కలెక్షన్ కూడా నెట్‌ఫ్లిక్స్ లైబ్రరీలో చేరనున్నాయి. దీంతో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రయిబర్లకు వినోదం రెట్టింపు కానుంది.

అయితే, సినిమాలను థియేటర్లలో విడుదల చేసే సంప్రదాయాన్ని కొనసాగిస్తామని నెట్‌ఫ్లిక్స్ స్పష్టం చేసింది. కానీ, థియేటర్ నుంచి స్ట్రీమింగ్‌కు వచ్చే సమయం తగ్గే అవకాశం ఉంది. హెచ్‌బీఓ కంటెంట్‌ను తమ సబ్‌స్క్రయిబర్లకు కాంప్లిమెంటరీ ఆఫర్‌గా ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు, రెండు లైబ్రరీలను కలిపి కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ప్రవేశపెట్టవచ్చని కూడా నెట్‌ఫ్లిక్స్ సూచనప్రాయంగా తెలిపింది.
Netflix
Warner Bros Discovery
Netflix Warner Bros deal
HBO
Game of Thrones
Harry Potter
OTT platforms
streaming services
entertainment industry
DC Comics

More Telugu News