వాహన, గృహ రుణదారులకు ఊరట.. వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్‌బీఐ

  • రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ
  • 5.5 శాతం నుంచి 5.25 శాతానికి చేరిన వడ్డీ రేటు
  • ఆర్థిక వ్యవస్థలోకి లక్ష కోట్ల నగదు పంపిణీకి నిర్ణయం
  • దేశ జీడీపీ వృద్ధి అంచనా 7.3 శాతానికి పెంపు
  • విదేశీ మారక నిల్వలు 686 బిలియన్ డాలర్లకు చేరిక
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమిచ్చే దిశగా భారత రిజర్వ్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. కీలకమైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (0.25%) తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన జరిగిన ద్రవ్య పరపతి కమిటీ (MPC) సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ తగ్గింపుతో రెపో రేటు 5.5 శాతం నుంచి 5.25 శాతానికి తగ్గింది.

ఈ సందర్భంగా గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థలో నగదు లభ్యతను పెంచేందుకు మరిన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ల ద్వారా లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి అదనంగా 5 బిలియన్ డాలర్ల విలువైన డాలర్-రూపాయి స్వాప్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి 8.2 శాతానికి చేరడం, ద్రవ్యోల్బణం 1.7 శాతానికి పడిపోవడం భారత ఆర్థిక వ్యవస్థకు 'గోల్డెన్‌ పీరియడ్' అని ఆయన అభివర్ణించారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం వల్లే వృద్ధికి మద్దతుగా వడ్డీ రేట్ల కోతకు అవకాశం లభించిందని వివరించారు. ఈ సానుకూల పరిణామాల నేపథ్యంలో దేశ జీడీపీ వృద్ధి అంచనాను కూడా 6.8 శాతం నుంచి 7.3 శాతానికి పెంచుతున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది.

ద్రవ్య విధానంలో తటస్థ వైఖరిని కొనసాగించాలని నిర్ణయించినట్లు మల్హోత్రా స్పష్టం చేశారు. ఆగస్టు, అక్టోబర్ నెలల్లో జరిగిన సమీక్షల్లో ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదని గుర్తుచేశారు. దేశ విదేశీ మారక నిల్వలు 686 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరాయని, ఇది 11 నెలల దిగుమతులకు సరిపోతుందని తెలిపారు. అయితే, ప్రపంచ వాణిజ్య అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఆర్థిక వ్యవస్థకు ప్రతికూల అంశాలుగా కొనసాగుతున్నాయని హెచ్చరించారు.

ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రయోజనాలను వాణిజ్య బ్యాంకులు ఎంత వేగంగా వినియోగదారులకు అందిస్తాయన్న దానిపైనే అసలైన ఫలితం ఆధారపడి ఉంటుంది.


More Telugu News