పుతిన్‌కు మోదీ ప్రత్యేక కానుక.. పవిత్ర గ్రంథం 'భగవద్గీత' బ‌హూక‌ర‌ణ‌

Narendra Modi gifts Bhagavad Gita to Vladimir Putin
  • భారత్ పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
  • పుతిన్‌కు రష్యన్ భాషలో అనువదించిన భగవద్గీతను బహూకరించిన ప్రధాని మోదీ
  • విమానాశ్రయంలో పుతిన్‌కు ఆత్మీయ స్వాగతం పలికిన మోదీ
  • నేడు ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు, పలు కీలక ఒప్పందాలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల భారత పర్యటనకు నిన్న‌ ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పాలం విమానాశ్రయానికి వెళ్లి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇరువురు నేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం పుతిన్‌కు రష్యన్ భాషలో అనువదించిన పవిత్ర గ్రంథం 'భగవద్గీత'ను మోదీ బహూకరించారు. 

గురువారం సాయంత్రం 7:30 గంటల సమయంలో ఢిల్లీ చేరుకున్న పుతిన్‌ను స్వాగతించిన అనంతరం, ఇరువురు నేతలు ఒకే కారులో ప్రధాని అధికారిక నివాసం 7, లోక్ కల్యాణ్ మార్గ్‌కు వెళ్లారు. అక్కడ పుతిన్ గౌరవార్థం మోదీ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ పర్యటనపై ప్రధాని మోదీ 'ఎక్స్‌' వేదికగా స్పందించారు. "నా మిత్రుడు, అధ్యక్షుడు పుతిన్‌కు భారత్‌కు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. మా చర్చల కోసం ఎదురుచూస్తున్నాను. భారత్-రష్యా స్నేహం కాలపరీక్షకు నిలిచింది" అని పేర్కొన్నారు.

ఇక, ఇవాళ‌ పుతిన్ పర్యటన బిజీగా సాగనుంది. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ఆయనకు అధికారిక స్వాగతం లభిస్తుంది. అనంతరం 11:30 గంటలకు రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. ఆ తర్వాత హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారు. ఈ భేటీలో పలు కీలక ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయి.

మధ్యాహ్నం 1:50 గంటలకు ఇరు దేశాల నేతలు సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడతారు. సాయంత్రం భారత వ్యాపార ప్రముఖులతో సమావేశమై, ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అవుతారు. రాత్రి 9 గంటలకు ఆయన రష్యాకు తిరుగు ప్రయాణమవుతారు.
Go Back to Shorts
Bhagavad Gita
Vladimir Putin
Narendra Modi
India Russia relations
Delhi
Russian language
bilateral meeting
trade agreements
Droupadi Murmu
Rajghat

More Telugu News