ఉడుపిలో ప్రధాని మోదీ: లక్ష కంఠాలతో భగవద్గీత పఠనం

  • కర్ణాటకలోని ఉడుపిలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ
  • ప్రసిద్ధ శ్రీకృష్ణ మఠంలో ప్రత్యేక పూజలు
  • లక్ష కంఠ భగవద్గీత పఠనం కార్యక్రమంలో పాల్గొన్నారు
  • ఉడుపి బీజేపీ సుపరిపాలనకు కర్మభూమి అని వ్యాఖ్య
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలోని ఉడుపిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసిద్ధ శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించి, 'లక్ష కంఠ భగవద్గీత పఠనం' కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు నగరంలో నిర్వహించిన భారీ ర్యాలీలో ప్రజలు ఆయనపై పూలవర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు.

అనంతరం శ్రీకృష్ణ మఠానికి చేరుకున్న మోదీకి, జగద్గురు శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ స్వాగతం పలికి సత్కరించారు. విద్యార్థులు, సన్యాసులు, పండితులు, వివిధ రంగాల పౌరులతో కలిసి లక్ష మంది ఏకకాలంలో భగవద్గీతను పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని కూడా పాలుపంచుకున్నారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఉడుపి తనకు చాలా ప్రత్యేకమైన ప్రదేశమని అన్నారు. జనసంఘ్, భారతీయ జనతా పార్టీల సుపరిపాలన నమూనాకు ఉడుపి ఒక కర్మభూమి అని అభివర్ణించారు. 1968లోనే ఇక్కడి ప్రజలు జనసంఘ్ తరఫున వీఎస్ ఆచార్యను మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నుకొని సుపరిపాలనకు పునాది వేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. పర్యటనలో భాగంగా, కార్యక్రమానికి హాజరైన చిన్నారులు గీసిన చిత్రాలను వారి దగ్గర నుంచి సేకరించాలని ప్రధాని తన భద్రతా సిబ్బందిని కోరడం ప్రత్యేకంగా నిలిచింది.


More Telugu News