దేవుడు వరం ఇస్తే.. అదే కోరుకుంటా: మంచు లక్ష్మి భావోద్వేగం

  • కుటుంబంలో గొడవలపై తొలిసారి స్పందించిన మంచు లక్ష్మి
  • త‌న కుటుంబం అంతా మళ్లీ సంతోషంగా కలిసి ఉండాలని దేవుడ్ని కోరుకుంటాన‌ని వ్యాఖ్య‌
  • కష్టకాలంలో కుటుంబమే అండగా ఉంటుందని వెల్లడి
నటి, నిర్మాత మంచు లక్ష్మి తన కుటుంబంలో చోటుచేసుకున్న వివాదాలపై తొలిసారి బహిరంగంగా స్పందించారు. తన కుటుంబం మళ్లీ మునుపటిలా సంతోషంగా కలిసిపోవాలని ఆకాంక్షిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

"ఒకవేళ దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే, నా కుటుంబం అంతా మళ్లీ సంతోషంగా కలిసి ఉండాలని కోరుకుంటాను. ప్రతీ కుటుంబంలో గొడవలు సహజం. కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా చివరికి అందరూ ఒక్కటిగా ఉండాలి. మన భారతీయ కుటుంబాల్లో గొడవలు వస్తే మళ్లీ కలవకూడదనే మొండి పట్టుదలతో ఉంటారు. కానీ, కష్టకాలంలో మనకు అండగా నిలిచేది రక్తసంబంధీకులే. వారితో కలిసి ఉండటానికి ఎంతటి పోరాటమైనా చేయాలి కానీ, దూరం పెంచుకోకూడదు" అన్నారు లక్ష్మి.

తాను ముంబైలో నివసించడం వల్ల కుటుంబంలో జరిగిన గొడవల గురించి పెద్దగా బాధపడలేదని కొన్ని ప్రచారాలు జరిగాయని, కానీ ఆ సమయంలో తాను ఎంత మానసిక వేదన అనుభవించానో తనకే తెలుసని ఆమె స్పష్టం చేశారు. తన బాధను అందరికీ ప్రదర్శించాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతోనే మౌనంగా ఉన్నట్లు వివరించారు. 

సాధారణంగా సినిమా ప్రమోషన్ల సమయంలో తప్ప, వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఇవ్వడానికి తాను ఇష్టపడనని తెలిపారు. కుటుంబంలో ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని, ముఖ్యంగా ఓ తల్లిగా తనకు తాను 10కి 10 మార్కులు వేసుకుంటానని మంచు లక్ష్మి పేర్కొన్నారు.




More Telugu News