ఆన్‌లైన్‌ వేధింపులపై సమంత పోరాటం.. ఐక్యరాజ్యసమితితో కీలక భాగస్వామ్యం

  • యూఎన్ విమెన్‌తో కలిసి సమంత ప్రచారం
  • నవంబర్ 25 నుంచి 16 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు
  • తాను కూడా అనేకసార్లు ఆన్‌లైన్‌లో వేధింపులు ఎదుర్కొన్నానని వెల్లడి
ప్రముఖ సినీ నటి సమంత మహిళలపై పెరుగుతున్న ఆన్‌లైన్‌ వేధింపులకు వ్యతిరేకంగా పోరాడేందుకు ముందుకొచ్చారు. ఈ బృహత్కార్యం కోసం ఆమె ఐక్యరాజ్యసమితికి చెందిన ‘యూఎన్ విమెన్‌ ఇండియా’తో చేతులు కలిపారు. ఆన్‌లైన్‌ వేదికగా మహిళలపై జరుగుతున్న హింసను అంతం చేయడమే లక్ష్యంగా నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 10 వరకు 16 రోజుల పాటు జరిగే ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో తాను పాలుపంచుకుంటున్నట్లు సమంత ఇంతకు ముందే స్వయంగా వెల్లడించారు.

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తనకున్న 37 మిలియన్ల ఫాలోవర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, ఆన్‌లైన్ వేధింపులపై తన అనుభవాలను పంచుకున్నారు. "సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్, ఆన్‌లైన్ బెదిరింపులు, డీప్ ఫేక్ ఫొటోల వంటి అనేక రూపాల్లో మహిళలు హింసకు గురవుతున్నారు. ఒకప్పుడు ప్రత్యక్షంగా జరిగే ఈ వేధింపులు ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌లపైకి చేరాయి. ఇది మానసికంగా కుంగదీస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను కూడా ఎన్నోసార్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నానని తెలిపారు.

మహిళల్లో ఈ అంశంపై అవగాహన పెంచడమే ఈ ప్రచార కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని సమంత స్పష్టం చేశారు. ఆన్‌లైన్ హింసను అరికట్టడానికి మరింత బలమైన వ్యవస్థలు, కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. యూఎన్ విమెన్ ఇండియా నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగం కావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు సమంత పేర్కొన్నారు. 


More Telugu News