హెచ్‌పీలో భారీ లేఆఫ్‌లు.. 6 వేల మంది ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం

  • ప్రముఖ టెక్ కంపెనీ హెచ్‌పీలో భారీ లేఆఫ్‌లు
  • రాబోయే మూడేళ్లలో 6 వేల మంది ఉద్యోగుల తొలగింపు
  • మొత్తం సిబ్బందిలో ఇది 10 శాతానికి సమానం
  • కృత్రిమ మేధ వినియోగం పెంచడమే లక్ష్యమన్న సంస్థ
  • ప్రకటనతో కుదేలైన హెచ్‌పీ షేర్లు
టెక్ రంగంలో ఉద్యోగాల కోతల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆర్థిక మాంద్యం భయాలతో మొదలైన ఈ ప్రక్రియ, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) వైపు మళ్లుతోంది. తాజాగా, ప్రపంచ ప్రఖ్యాత పీసీ, ప్రింటర్ల తయారీ సంస్థ హెచ్‌పీ (HP) కూడా భారీ లేఆఫ్‌లను ప్రకటించి టెక్‌ వర్గాల్లో కలకలం రేపింది. రాబోయే రెండు, మూడేళ్లలో సుమారు 6 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది.

2028 ఆర్థిక సంవత్సరం నాటికి తమ ప్రపంచవ్యాప్త ఉద్యోగుల సంఖ్యను 4,000 నుంచి 6,000 వరకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెచ్‌పీ తెలిపింది. ఈ కోతలు సంస్థ మొత్తం సిబ్బందిలో దాదాపు 10 శాతానికి సమానం. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంతో పాటు, ఉత్పత్తుల అభివృద్ధిలో కృత్రిమ మేధ వినియోగాన్ని గణనీయంగా పెంచేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యం వివరించింది.

గతేడాది ఆర్థిక అనిశ్చితి కారణాలతో వేలాది మందిని తొలగించిన టెక్ కంపెనీలు, ఇప్పుడు ఏఐని అందిపుచ్చుకునే క్రమంలో మళ్లీ ఉద్యోగులపై వేటు వేయడం ఆందోళన కలిగిస్తోంది. హెచ్‌పీ లేఆఫ్‌ల ప్రకటన వెలువడిన వెంటనే మార్కెట్‌లో ఆ కంపెనీ షేర్ల విలువ పడిపోవడం గమనార్హం. ఈ పరిణామం టెక్‌ ఉద్యోగుల్లో నెలకొన్న అభద్రతాభావాన్ని మరింత పెంచుతోంది. 


More Telugu News