సీఎం రేసులో నేను ఎప్పుడూ ఉంటా.. కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర సంచలన వ్యాఖ్యలు

  • 2013లో తన నాయకత్వంలోనే పార్టీ గెలిచిందని గుర్తుచేసిన హోంమంత్రి
  • దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉందని వ్యాఖ్య
  • సీఎం మార్పుపై ఎలాంటి నిర్ణయమైనా అధిష్ఠానమే తీసుకుంటుందని వెల్లడి
కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవిపై నెలకొన్న పోటీ మరోసారి వేడెక్కింది. ముఖ్యమంత్రి పదవి రేసులో తాను ఎల్లప్పుడూ ఉంటానని రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

"2013లో నేను కేపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది. అయితే, ఆ విజయం నా ఒక్కడి వల్లే వచ్చిందని నేను చెప్పను, అది ఉమ్మడి కృషి ఫలితం. దురదృష్టవశాత్తు ఆ ఎన్నికల్లో నేను ఓడిపోయాను. ఒకవేళ నేను గెలిచి ఉంటే అప్పుడు ఏం జరిగి ఉండేదో చెప్పలేం" అని ఆయన అన్నారు.

రాష్ట్రానికి ఒక దళితుడు ముఖ్యమంత్రి కావాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉందని పరమేశ్వర గుర్తు చేశారు. "మనమంతా కలిసి భోజనం చేస్తే ఈ డిమాండ్ నెరవేరుతుందా? మేమంతా ఒకే భావజాలం ఉన్నవాళ్లం. అంతర్గత రిజర్వేషన్ల కోసం పోరాడాం. మా సమస్యల గురించి మేం చర్చించుకోవద్దా?" అని ఆయన ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి మార్పు జరిగితే మిమ్మల్ని పరిగణనలోకి తీసుకుంటారా? అని అడగ్గా.. "ముందు ఆ పరిస్థితి రానివ్వండి. ఇంకా రాలేదు కదా. దీనికోసం నేనైతే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవను. అవసరమైనప్పుడు మాత్రమే ఆయన్ను కలుస్తాను" అని స్పష్టం చేశారు. సీఎం సిద్ధరామయ్య పదవీకాలం రెండున్నరేళ్లేనని ఎప్పుడూ చెప్పలేదని, మధ్యలో మార్పు ఉంటుందా? లేదా? అనేది పూర్తిగా అధిష్ఠానం నిర్ణయమని ఆయన వివరించారు. సిద్ధరామయ్య, ఖర్గే భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని, మీడియానే అనవసరమైన ప్రాధాన్యం ఇస్తోందని ఆయన అన్నారు.


More Telugu News