దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు టీమిండియా ఎంపిక... కెప్టెన్ గా కేఎల్ రాహుల్

  • దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఎంపిక
  • మెడ నొప్పితో బాధపడుతున్న గిల్
  • కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌కు బాధ్యతలు
  • జట్టులో చోటు దక్కించుకున్న సీనియర్లు రోహిత్, కోహ్లీ
  • నవంబర్ 30 నుంచి మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం
  • డిసెంబర్ 6న విశాఖపట్నంలో చివరి వన్డే
దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం బీసీసీఐ నేడు భారత జట్టును ప్రకటించింది. సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన టీమిండియా జట్టుకు వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ మెడ నొప్పి కారణంగా ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కు కూడా దూరమైన సంగతి తెలిసిందే. గిల్ వన్డే సిరీస్ కూడా ఆడే పరిస్థితి లేకపోవడంతో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్టర్ల బృందం కేఎల్ రాహుల్ కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. కాగా, ఈ సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు చోటు కల్పించారు.

గాయం నుంచి కోలుకుని టెస్టు సిరీస్ ఆడుతున్న రిషభ్ పంత్‌కు వన్డే సిరీస్‌లో కూడా అవకాశం లభించింది. యువ ఆటగాళ్లు తిలక్ వర్మ, తెలుగు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణాలకు కూడా సెలక్టర్లు పిలుపునిచ్చారు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ స్పిన్ బాధ్యతలు మోయనున్నారు. సీనియర్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి కల్పించారు.

ఈ సిరీస్‌లో భాగంగా మొదటి వన్డే నవంబర్ 30న రాంచీలో, రెండో వన్డే డిసెంబర్ 3న రాయ్‌పూర్‌లో జరగనున్నాయి. చివరిదైన మూడో వన్డేకు డిసెంబర్ 6న విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది.

భారత వన్డే జట్టు:
కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ధ్రువ్ జురెల్.


More Telugu News