ట్రంప్‌ను కలిసిన న్యూయార్క్ మేయర్ మమ్దానీ... శశిథరూర్ ఆసక్తికర పోస్టు

  • ఎన్నికల సమయంలో పరస్పరం విమర్శించుకున్న ట్రంప్, మమ్దానీ
  • ఇటీవల ఇరువురి స్నేహపూర్వక భేటీ
  • భారత్‌లోనూ ఇలాంటి ప్రజాస్వామయం పని చేయాలని పేర్కొన్న శశిథరూర్ో
"ప్రజాస్వామ్యం అంటే ఇలాగే ఉండాలి. ఎన్నికల సమయంలో మీ సిద్ధాంతం, భావజాలం కోసం ఎంతవరకైనా పోరాడవచ్చు. కానీ ప్రజల తీర్పు వెలువడిన తర్వాత దేశ ప్రయోజనాల దృష్ట్యా అధికార, ప్రతిపక్షాలు పరస్పరం సహకరించుకోవాలి" అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీ ఇటీవల సమావేశమయ్యారు. ఎన్నికల సమయంలో వీరిద్దరు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఆ తర్వాత వీరు సామరస్యంగా కలవడం విశేషం. వీరి మధ్య జరిగిన స్నేహపూర్వక సమావేశంపై శశిథరూర్ స్పందించారు.

ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా ఒక పోస్టు చేశారు. ప్రజాస్వామ్యం ఈ విధంగానే పని చేయాలని, ఇలాంటి స్ఫూర్తిని భారతదేశంలో కూడా చూడాలని ఆకాంక్షించారు. ఈ విషయంలో తనవంతు కృషి చేయడానికి ప్రయత్నిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

ఇటీవల శశిథరూర్ కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోదీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మోదీని ప్రశంసిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఆయన పట్ల తీవ్ర అసంతృప్తితో ఉంది. శశిథరూర్‌కు బీజేపీ భావజాలం నచ్చితే ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కొనసాగుతున్నారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి పనిచేయాలని శశిథరూర్ అభిప్రాయపడ్డారు.


More Telugu News