ఈ వారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

  • అంతర్జాతీయంగా వాణిజ్య ఉపశమన సంకేతాలు, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపు అంచనాలు
  • అంతర్జాతీయ సంకేతాలతో ఈ వారం అస్థిరంగా కదలాడిన బంగారం ధరలు
  • సోమవారం రూ. 1,22,432 వద్ద ప్రారంభమై, శుక్రవారం రూ. 1,22,653 వద్ద ముగిసిన పసిడి ధర
బంగారం, వెండి ధరలు ఈ వారం అస్థిరంగా కొనసాగాయి. ప్రపంచ వాణిజ్య రంగంలో ఉపశమన సంకేతాలు, అమెరికా ఫెడ్ రిజర్వ్ డిసెంబర్‌లో వడ్డీ రేట్లు తగ్గింపు అంచనాలు బలహీనపడటం, డాలర్ ఇండెక్స్ బలంగా ఉండటం వంటి కారణాల వల్ల ఈ విలువైన లోహాల ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నాయి.

ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) తెలిపిన వివరాల ప్రకారం, ఈ వారం ప్రారంభంలో (సోమవారం) రూ. 1,22,432గా ఉన్న బంగారం ధర శుక్రవారం రూ. 1,22,653 వద్ద ముగిసింది. ఈ వారంలో మంగళవారం రూ.1,21,691 కనిష్ఠ స్థాయికి చేరిన బంగారం, బుధవారం రూ.1,23,388 గరిష్ఠ ధరను తాకింది. వెండి ధర కిలో రూ.1,51,129కి చేరింది. సోమవారం రూ.1,54,933 వద్ద ప్రారంభమైన వెండి ధరల్లో కూడా హెచ్చుతగ్గులు కనిపించాయి. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో బంగారం ఔన్స్ ధర 4,079.5 డాలర్ల వద్ద ముగిసింది.

అమెరికాలో సెప్టెంబర్ నెలలో జాబ్ డేటా అంచనాల కంటే మెరుగ్గా ఉండటంతో బంగారం ధరలు శుక్రవారం భారీగా పడిపోయాయని బులియన్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో బంగారం ధరలు రూ.1,20,000 నుండి రూ. 1,24,000 మధ్య కదలాడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, నేడు బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.


More Telugu News