రేపటి నుంచి టీమిండియాతో రెండో టెస్టు... దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురుదెబ్బ

  • భారత పర్యటన మొత్తానికి దూరమైన కగిసో రబాడా
  • పక్కటెముకల గాయంతో సిరీస్ నుంచి నిష్క్రమణ
  • రబాడా స్థానంలో జట్టులోకి వచ్చిన లుంగి ఎంగిడి
  • రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న సౌతాఫ్రికా
  • రేపటి నుంచి రెండో టెస్టు 
  • భారత్‌లో చివరిసారిగా 2000 సంవత్సవరంలో సిరీస్ గెలిచిన సఫారీలు
భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడా గాయం కారణంగా రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు. పక్కటెముకల ఒత్తిడి గాయంతో బాధపడుతున్న అతడు.. గౌహతిలో జరిగే రెండో టెస్టుతో పాటు, ఆ తర్వాత జరగబోయే వైట్-బాల్ సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండడని క్రికెట్ సౌతాఫ్రికా (CSA) ప్రకటించింది.

కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టుకు కూడా రబాడా దూరమైన సంగతి తెలిసిందే. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడం, నొప్పి ఇంకా కొనసాగుతుండటంతో అతడిని సిరీస్ నుంచి తప్పిస్తున్నట్లు సీఎస్ఏ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. రబాడా స్థానంలో ఇప్పటికే లుంగి ఎంగిడిని జట్టులోకి తీసుకున్నారు. రబాడా నాలుగు వారాల పాటు వైద్య పర్యవేక్షణలో ఉంటాడని, రెండో టెస్ట్ ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికాకు తిరిగి వెళతాడని సీఎస్ఏ వివరించింది.

రబాడా గైర్హాజరీతో గౌహతి టెస్టులో సౌతాఫ్రికా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది. కోల్‌కతా టెస్టులో మొత్తం 8 వికెట్లు పడగొట్టి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచిన స్పిన్నర్ సైమన్ హార్మర్ సఫారీ బౌలింగ్‌కు నాయకత్వం వహించాడు. అతడికి మరో స్పిన్నర్ కేశవ్ మహారాజ్‌తో పాటు, పేస్ ఆల్‌రౌండర్లు మార్కో యన్‌సెన్, వియాన్ ముల్డర్, కార్బిన్ బాష్ సహకారం అందించారు.

గౌహతి టెస్టులో గెలిచి 25 ఏళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలని టెంబా బవుమా సేన పట్టుదలగా ఉంది. చివరిసారిగా 2000వ సంవత్సరంలో హన్సీ క్రోన్యే కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా జట్టు భారత్‌లో టెస్టు సిరీస్ కైవసం చేసుకుంది.


More Telugu News