దేశీయ ఏఐ టెక్నాలజీతో లావా 'అగ్ని 4'.. ఆకట్టుకుంటున్న ఫీచర్లు, ధర!

  • భారత మార్కెట్లోకి లావా 'అగ్ని 4' స్మార్ట్‌ఫోన్ విడుదల
  • భారతీయుల కోసం ప్రత్యేకంగా 'వాయు ఏఐ' ఫీచర్లు
  • మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్, 50MP కెమెరా
  • ధర రూ.24,999.. ఆఫర్‌లో రూ.22,999కే లభ్యం
  • ఈ నెల‌ 25 నుంచి అమెజాన్‌లో అమ్మకాలు ప్రారంభం
భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా, 'అగ్ని 4' పేరుతో తన కొత్త ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ముఖ్యంగా భారతీయుల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన 'వాయు ఏఐ' అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో ఈ ఫోన్‌ను ప్రవేశపెట్టింది. శక్తివంతమైన ప్రాసెసర్, ఆకట్టుకునే కెమెరాలతో ఈ ఫోన్ మార్కెట్లోకి వ‌స్తోంది.

ఫీచ‌ర్లు ఇలా..
ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ 'వాయు ఏఐ'. ఇది సిస్టమ్ లెవల్‌లో పనిచేస్తుందని, సర్కిల్ టు సెర్చ్, విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ ఏఐ, ఏఐ కాల్ సమ్మరీ, ఏఐ టెక్ట్స్ అసిస్టెంట్, ఏఐ ఫొటో ఎడిటర్ వంటి అనేక సదుపాయాలను అందిస్తుందని కంపెనీ తెలిపింది. 6.67 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఫోన్ వేడెక్కకుండా లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేశారు.

కెమెరా విషయానికొస్తే.. వెనుకవైపు 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందువైపు కూడా 50MP కెమెరాను అమర్చారు. 5000mAh బ్యాటరీ, 66W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 19 నిమిషాల్లో 50శాతం ఛార్జింగ్ పూర్తవుతుందని లావా చెబుతోంది. ఆండ్రాయిడ్ 15 ఓఎస్‌తో వస్తున్న ఈ ఫోన్‌కు 3 ఏళ్ల ఓఎస్ అప్‌డేట్స్, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని హామీ ఇచ్చింది.

ధ‌ర ఎంతంటే..!
8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో లభించే ఈ ఫోన్ అసలు ధర రూ.24,999గా నిర్ణయించారు. లాంచింగ్ ఆఫర్ కింద ఏ బ్యాంకు కార్డుతో కొనుగోలు చేసినా రూ.2,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో దీనిని రూ.22,999కే సొంతం చేసుకోవచ్చు. ఫాంట‌మ్ బ్లాక్‌, లూనార్ మిస్ట్ రంగులలో లభించే ఈ ఫోన్ అమ్మకాలు నవంబర్ 25 నుంచి అమెజాన్‌లో ప్రారంభమవుతాయి.


More Telugu News