అణు విద్యుత్ రంగంలోకి ప్రవేశిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌టీపీసీ

  • ఏపీ, గుజరాత్, మధ్యప్రదేశ్‌లో ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన స్థలాల అన్వేషణ
  • 2047 నాటికి 30 గిగావాట్ల అణు విద్యుదుత్పత్తి సాధించాలని లక్ష్యం
  • ఒక గిగావాట్‌ ప్లాంటుకు రూ.20,000 కోట్ల వరకు పెట్టుబడి అంచనా
  • యురేనియం కోసం దేశీయ, విదేశీ వనరులపై ప్రత్యేక దృష్టి
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) అణు విద్యుత్ రంగంలోకి భారీ ప్రణాళికలతో ప్రవేశిస్తోంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 700, 1000, 1600 మెగావాట్ల సామర్థ్యంతో అణు విద్యుత్ ప్రాజెక్టులను స్థాపించడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను అన్వేషిస్తున్నట్లు సంస్థ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు (ఏఈఆర్‌బీ) అనుమతించిన ప్రాంతాల్లోనే ఈ ప్లాంట్లను నిర్మించనున్నారు. 2047 నాటికి దేశంలో 100 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా, ఎన్‌టీపీసీ 30 గిగావాట్ల వాటాను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక గిగావాట్ సామర్థ్యం గల అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి సుమారు రూ.15,000 కోట్ల నుంచి రూ.20,000 కోట్ల వరకు పెట్టుబడి అవసరమవుతుందని అంచనా. ప్రాజెక్టు ప్రణాళిక దశ నుంచి ఉత్పత్తి ప్రారంభం కావడానికి కనీసం మూడేళ్ల సమయం పడుతుందని సంస్థ భావిస్తోంది.

ఈ ప్లాంట్లకు అత్యంత కీలకమైన ముడిపదార్థం యురేనియం సమీకరణపై ఎన్‌టీపీసీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందుకోసం యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో వాణిజ్య, సాంకేతిక ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాకుండా, విదేశాల్లోనూ యురేనియం ఆస్తుల సమీకరణకు ప్రయత్నాలు చేస్తోంది.

ప్రస్తుతం ఎన్‌టీపీసీకి దేశవ్యాప్తంగా బొగ్గు, గ్యాస్, సౌర, జల విద్యుత్ ప్లాంట్ల ద్వారా 84,848 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఇదివరకే రాజస్థాన్‌లో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌తో కలిసి రూ.42,000 కోట్లతో ఓ అణు విద్యుత్ ప్లాంటును నిర్మిస్తోంది. 


More Telugu News