ఏఐపై సత్య నాదెళ్ల పోస్ట్.. ఎలాన్ మస్క్ రియాక్షన్‌తో దుమారం

  • ఏఐపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కీలక పోస్ట్
  • ప్రతి సంస్థ సొంతంగా ఏఐ సామర్థ్యాలు పెంచుకోవాలని సూచన
  • లేదంటే మొత్తం లాభం టెక్ దిగ్గజాలకే వెళ్తుందని హెచ్చరిక
  • నాదెళ్ల పోస్ట్‌ పై ఎలాన్ మస్క్ ఆసక్తికర స్పందన
ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) భవిష్యత్తుపై చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్ట్‌కు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందించిన తీరు సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకు దారితీసింది.

ప్రతి సంస్థ తమ ఏఐ సామర్థ్యాలను స్వతంత్రంగా నిర్మించుకోవాలని సత్య నాదెళ్ల తన పోస్ట్‌లో సూచించారు. టెక్ పరిశ్రమ ‘జీరో సమ్ గేమ్’గా మారకూడదని ఆయన హెచ్చరించారు. ఏఐ ఫలితాలు అందరికీ చేరాలంటే, ప్రతి కంపెనీ తన సొంత ఏఐ వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలని, లేనిపక్షంలో మొత్తం ఆర్థిక ప్రయోజనం కేవలం కొన్ని టెక్ దిగ్గజాలకే పరిమితమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఒక వేదికపై పనిచేసే కంపెనీలు సృష్టించే ఆర్థిక విలువ, ఆ వేదికను తయారుచేసిన సంస్థ విలువ కంటే ఎక్కువగా ఉండాలన్న బిల్ గేట్స్ మాటలను నాదెళ్ల గుర్తుచేశారు. ఓపెన్‌ఏఐ, ఎన్విడియా, ఏఎండీ వంటి సంస్థలతో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం ఈ కోవలోకే వస్తుందని ఆయన వివరించారు. కంపెనీలు తమ స్వాతంత్ర్యాన్ని కాపాడుకుంటూ ఏఐని నిర్మించుకోవాలని పేర్కొన్నారు.

అయితే, సత్య నాదెళ్ల సుదీర్ఘ పోస్ట్‌పై ఎలాన్ మస్క్ కేవలం ఒకే ఒక్క ఎమోజీతో స్పందించారు. తల పట్టుకున్నట్టుగా ఉండే ‘ఫేస్‌పామ్’ ఎమోజీని ఆయన వ్యాఖ్యగా పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నాదెళ్ల అభిప్రాయంతో మస్క్ ఏకీభవించలేదా? లేక మరేదైనా కారణం ఉందా? అంటూ రకరకాలుగా చర్చిస్తున్నారు. 


More Telugu News