ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఈ నెల‌ 30 తర్వాత ఆ సేవలు బంద్

  • ఈ నెల‌ 30 నుంచి ఎం-క్యాష్ సేవలు నిలిపివేత
  • ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో లైట్‌లో ఈ సర్వీస్ బంద్
  • ప్రత్యామ్నాయంగా యూపీఐ, ఐఎంపీఎస్, నెఫ్ట్ సేవలు
  • కస్టమర్లు ఇతర డిజిటల్ మార్గాలను ఎంచుకోవాలని సూచన
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తమ కస్టమర్లకు ఒక ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. డిజిటల్ చెల్లింపుల విభాగంలో అందిస్తున్న 'ఎం-క్యాష్' (m-Cash) సర్వీసును నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నెల‌ 30వ తేదీ తర్వాత ఈ సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది.

ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో లైట్ యాప్‌లలో ప్రస్తుతం ఈ ఎం-క్యాష్ సేవలు అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా కస్టమర్లు లబ్ధిదారుడి (బెనిఫిషియరీ) బ్యాంక్ ఖాతాను ముందుగా నమోదు చేయకుండానే, కేవలం వారి మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీ ఉపయోగించి డబ్బు పంపడం, స్వీకరించడం చేయవచ్చు. అయితే, ఈ సదుపాయాన్ని ఈ నెల 30 నుంచి తొలగించనున్నట్లు బ్యాంకు తెలిపింది.

ఎం-క్యాష్ సేవలు నిలిచిపోనున్న నేపథ్యంలో కస్టమర్లు నగదు బదిలీ కోసం ఇతర సురక్షితమైన డిజిటల్ పద్ధతులను ఉపయోగించుకోవాలని ఎస్‌బీఐ సూచించింది. ప్రత్యామ్నాయ మార్గాలుగా యూపీఐ (UPI), ఐఎంపీఎస్ (IMPS), నెఫ్ట్ (NEFT), ఆర్‌టీజీఎస్ (RTGS) వంటివి అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.

ఎం-క్యాష్ మాదిరిగానే యూపీఐ ద్వారా డబ్బు పంపడానికి కూడా లబ్ధిదారుడిని ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. భీమ్ ఎస్‌బీఐ పే, యోనో యాప్‌ల ద్వారా మొబైల్ నంబర్ లేదా ఖాతా వివరాలతో సులభంగా లావాదేవీలు జరపవచ్చు. అలాగే ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ సేవలు యథావిధిగా పనిచేస్తాయని బ్యాంకు వివరించింది.


More Telugu News