మాకు ఇది ఒక పాఠం: బీహార్ ఎన్నికల ఫలితాలపై డీ.కె. శివకుమార్

  • ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి
  • కొత్త వ్యూహాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య
  • బీహార్ ఫలితాలు నిరాశపరిచాయన్న అశోక్ గెహ్లాట్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీ.కె. శివకుమార్ స్పందించారు. కాంగ్రెస్, ఇండియా కూటమి కోసం కొత్త వ్యూహాలను రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్‌బంధన్ భారీ ఓటమి నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఫలితాలు తమ పార్టీకి, మిత్రపక్షాలకు ఒక గుణపాఠం అని పేర్కొన్నారు.

"ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. మాకు ఇది ఒక పాఠం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి కొత్త వ్యూహాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను" అని డీ.కె. శివకుమార్ అన్నారు.

మహిళా సాధికారత, స్వయం ఉపాధి కింద మహిళలకు రూ. 10,000 చొప్పున జమ చేయడం, మహిళా ఓటర్ల పెరుగుదల ఎన్డీయే కూటమి గెలుపుకు కారణమని భావిస్తున్నారా? అని మీడియా ప్రశ్నించగా, ఫలితాలు వచ్చాక కారణాలేమిటో తెలియాల్సి ఉందని శివకుమార్ అన్నారు. పూర్తి ఫలితాలు వచ్చాక మళ్లీ మాట్లాడతానని ఆయన చెప్పారు.

మహాఘట్‌బంధన్ ఓటమిపై కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ స్పందించారు. బీహార్ ఫలితాలు తమను నిరాశపరిచాయని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ప్రతి మహిళకు ప్రభుత్వం రూ. 10 వేలు పంపిణీ చేసిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రచారం కొనసాగుతున్నప్పుడు కూడా ఇది కొనసాగిందని ఆరోపించారు. 


More Telugu News