ఢిల్లీ పేలుడు ఎఫెక్ట్... ఏపీ వ్యాప్తంగా హై అలర్ట్

  • రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశం
  • భద్రతను కట్టుదిట్టం చేయాలని డీజీపీకి స్పష్టమైన సూచనలు
  • తిరుపతి, కృష్ణా జిల్లాల్లో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో విస్తృత తనిఖీలు
  • రద్దీ ప్రాంతాల్లో నిఘా పెంచాలని జిల్లా ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు
  • అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే 112కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి
ఢిల్లీలోని ఎర్రకోట మెట్రోస్టేషన్ సమీపంలో సోమవారం జరిగిన పేలుళ్ల ఘటన ఆంధ్రప్రదేశ్‌ను అప్రమత్తం చేసింది. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ఆదేశించారు. పేలుళ్లలో మరణించిన వారి కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు.

హోంమంత్రి ఆదేశాల మేరకు డీజీపీతో పాటు పోలీసు ఉన్నతాధికారులు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న పలు ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల దృష్ట్యా భద్రత విషయంలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వొద్దని, అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉండాలని అనిత పోలీసు యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని అన్ని సున్నితమైన, రద్దీ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని ఆమె స్పష్టం చేశారు.

రంగంలోకి దిగిన పోలీస్ యంత్రాంగం

హోంమంత్రి ఆదేశాలతో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఎస్పీలు, రేంజ్ డీఐజీలు, ఐజీలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. మాల్స్, హోటల్స్, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి జనసమ్మర్దం ఉండే ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు గానీ, వస్తువులు గానీ కనిపిస్తే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 112కు సమాచారం అందించాలని డీజీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ నేపథ్యంలో తిరుపతి, కృష్ణా జిల్లాల పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. తిరుపతి రైల్వేస్టేషన్, బస్టాండ్, తిరుమల వసతి గృహాలతో పాటు అలిపిరి టోల్‌గేట్, నడక మార్గాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు బస్టాండ్, లాడ్జిల్లోనూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 

ప్రకాశం జిల్లాలోనూ విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, జిల్లా వ్యాప్తంగా ఉన్న కోస్టల్ ప్రాంతంతో పాటు అనుమానాస్పద ప్రాంతాలలో బాంబ్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ల సహకారంతో విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కోస్టల్ కారిడార్ ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం చేశారు. కొత్త వ్యక్తులు కనిపిస్తే... వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని చేపలు వేటకు వెళ్ళే మత్యుకారులను ఆదేశించారు. అదేవిధంగా సముద్ర తీర ప్రాంతంలో వేటకు వెళ్ళినప్పుడు.. కొత్త ఏమైనా బోట్లు కనిపిస్తే వేంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలన్నారు.




More Telugu News