కొత్త ఫీచర్ పై కసరత్తులు... వాట్సాప్ నుంచి ఇతర మెసేజింగ్ యాప్ లకు సందేశాలు!

  • వాట్సప్‌లో సరికొత్త క్రాస్-ప్లాట్‌ఫామ్ చాట్ ఫీచర్
  • ఇతర మెసేజింగ్ యాప్స్‌తో నేరుగా చాటింగ్ చేసే సదుపాయం
  • ఫొటోలు, వీడియోలు, ఫైల్స్ పంపుకునేందుకు అనుమతి
  • ఈయూ నిబంధనలకు అనుగుణంగా ఈ మార్పులు
  • యూజర్ల ఇష్టప్రకారం ఫీచర్‌ను ఆన్ లేదా ఆఫ్ చేసుకునే వెసులుబాటు
  • థర్డ్-పార్టీ చాట్స్‌కు కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రత
మెటా సంస్థకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్, వినియోగదారుల కోసం ఒక వినూత్న ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. 'క్రాస్-ప్లాట్‌ఫామ్ చాట్' పేరుతో రానున్న ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు ఇతర మెసేజింగ్ యాప్‌ల నుంచి కూడా నేరుగా వాట్సప్‌లో మెసేజ్‌లు స్వీకరించవచ్చు, పంపవచ్చు. యూరోపియన్ యూనియన్ (ఈయూ) డిజిటల్ మార్కెట్స్ యాక్ట్ నిబంధనలకు అనుగుణంగా వాట్సప్ ఈ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

వాట్సప్ అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు అందించే 'వాబీటా ఇన్ఫో' కథనం ప్రకారం, ఈ ఫీచర్ ప్రస్తుతం పరీక్షల దశలో ఉంది. ఇది వచ్చే ఏడాది యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఇతర యాప్‌లకు ఫొటోలు, వీడియోలు, వాయిస్ నోట్స్, డాక్యుమెంట్లు వంటివి పంపుకోవచ్చు. అయితే, వాట్సప్‌కు ప్రత్యేకమైన స్టేటస్ అప్‌డేట్లు, డిసప్పియరింగ్ మెసేజ్‌లు, స్టిక్కర్లు వంటివి పంపేందుకు అవకాశం ఉండదు.

ఫీచర్ ఎలా పనిచేస్తుంది?

ఈ ఫీచర్‌ను వినియోగించాలనుకునే యూజర్లు వాట్సప్ సెట్టింగ్స్‌లోని 'అకౌంట్' విభాగానికి వెళ్లి, అక్కడ 'థర్డ్-పార్టీ చాట్స్' ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. యూజర్లు తమకు వచ్చే మెసేజ్‌లను 'కంబైన్డ్' లేదా 'సపరేట్' ఇన్‌బాక్స్‌లలో చూసుకునే అవకాశం ఉంటుంది. కంబైన్డ్ ఆప్షన్ ఎంచుకుంటే వాట్సప్, ఇతర యాప్స్ చాట్స్ అన్నీ ఒకేచోట కనిపిస్తాయి. సపరేట్ ఆప్షన్ ద్వారా థర్డ్-పార్టీ చాట్స్‌ను ఒక ప్రత్యేక ఫోల్డర్‌లో భద్రపరచుకోవచ్చు.

ముఖ్యంగా, థర్డ్-పార్టీ యాప్స్ నుంచి వచ్చే చాట్స్‌కు కూడా వాట్సప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రతను అందిస్తుండటం గమనార్హం. అయితే, ప్రతి యాప్‌కు సొంత డేటా ప్రొటెక్షన్ విధానాలు ఉండే అవకాశం ఉందని వాట్సప్ స్పష్టం చేసింది. ఈ ఫీచర్ పూర్తిగా ఆప్షనల్ అని, వినియోగదారులకు ఇష్టం లేకపోతే దీన్ని ఆఫ్ చేసుకునే సౌకర్యం కూడా ఉంటుందని వాబీటా ఇన్ఫో వివరించింది. 


More Telugu News