‘వసంతం-2025’ వస్త్ర ప్రదర్శన ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్... ఫొటోలు ఇవిగో!

  • విజయవాడలో 'వసంతం-2025' చేనేత ఎగ్జిబిషన్ ప్రారంభం
  • ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేశ్
  • 'కొత్తూరు వసంత వర్ణ' నూతన బ్రాండ్‌ ఆవిష్కరణ 
  • సహజసిద్ధ రంగులతో తయారైన కొత్త బ్రాండ్
విజయవాడ నగరంలోని ఎంజీ రోడ్డులో ఉన్న శ్రీ శేషసాయి కల్యాణ వేదికలో ఏర్పాటు చేసిన 'వసంతం-2025' చేనేత, చేతివృత్తుల ప్రదర్శనను రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ బుధవారం ప్రారంభించారు. క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సహజ రంగులతో తయారుచేసిన 'కొత్తూరు వసంత వర్ణ' అనే నూతన చేనేత బ్రాండ్‌ను ఆవిష్కరించారు.

ఈ ప్రదర్శనలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత కళాకారులు, చేతివృత్తుల వారు రూపొందించిన ఉత్పత్తులను 70కి పైగా స్టాళ్లలో ప్రదర్శనకు ఉంచారు. ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం మంత్రి లోకేశ్ అక్కడి స్టాళ్లను సందర్శించి, ఉత్పత్తులను పరిశీలించారు. కళాకారులతో మాట్లాడి వారి నైపుణ్యాన్ని అభినందించారు.

దీనిపై మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, "క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించాను. మన కళాకారుల ప్రతిభ అద్భుతంగా ఉంది. ప్రకృతి సహజసిద్ధ రంగులతో తయారుచేసిన 'కొత్తూరు వసంత వర్ణ' బ్రాండ్‌ను ఆవిష్కరించడం ఆనందదాయకం" అని తెలిపారు. చేనేత కళకు, చేతివృత్తుల వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.


More Telugu News