ఆరెస్సెస్ పై నిషేధం.. స్పందించిన మల్లికార్జున ఖర్గే

  • ఆరెస్సెస్‌ను నిషేధించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని వ్యాఖ్య
  • దేశంలో శాంతిభద్రతల సమస్య తలెత్తడానికి ఆరెస్సెస్, బీజేపీ కారణమని విమర్శ
  • పటేల్, నెహ్రూ మధ్య చీలిక తేవడానికి ప్రయత్నించారని ఆరోపణ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌(ఆరెస్సెస్)ను నిషేధించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని, దేశ తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఆరెస్సెస్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధించారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పునరుద్ఘాటించారు. దేశంలో ఎక్కువగా శాంతిభద్రతల సమస్య తలెత్తడానికి ఆరెస్సెస్, బీజేపీ కారణమని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో నిషేధించాలనేది తన అభిప్రాయమన్నారు.

శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. జాతి ఐక్యతకు వారు ఎంతో చేశారని అన్నారు.

ఆరెస్సెస్ నిషేధం అంశంపై కూడా ఆయన స్పందించారు. దాని భావజాలం విషంతో సమానమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీ హత్యకు దారితీసిన వాతావరణాన్ని ఆరెస్సెస్ సృష్టించిందని మండిపడ్డారు. ఇదే విషయాన్ని పేర్కొంటూ సర్దార్ వల్లభాయ్ పటేల్... శ్యాంప్రసాద్ ముఖర్జీకి లేఖ రాశారని తెలిపారు. పటేల్, నెహ్రూ మధ్య సత్సంబంధాలు ఉన్నప్పటికీ వారి మధ్య చీలిక తేవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.

కశ్మీర్ మొత్తాన్ని భారతదేశంలో కలపాలని పటేల్ అనుకున్నారని, కానీ నెహ్రూ ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. మోదీ వ్యాఖ్యలపై ఖర్గే పైవిధంగా స్పందించారు. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ కూడా స్పందించింది. దశాబ్దాల పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను కాంగ్రెస్ ఎందుకు విస్మరించిందని ప్రశ్నించింది.


More Telugu News