ఆఫ్ఘన్, పాకిస్థాన్ మధ్య ఘర్షణ.. తమను లాగడంపై తీవ్రంగా స్పందించిన భారత్

  • ఆఫ్ఘాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, స్వాతంత్య్రానికి భారత్ కట్టుబడి ఉందన్న భారత్
  • సీమాంతర ఉగ్రవాదం కొనసాగింపును పాకిస్థాన్ హక్కుగా భావిస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శ
  • పాక్ చర్యలను పొరుగు దేశాలు ఆమోదించవన్న భారత్
ఆప్ఙనిస్థాన్, పాకిస్థాన్ దేశాల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఘర్షణలపై భారత్ స్పందించింది. ఆఫ్ఘాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, స్వాతంత్య్రానికి భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ, సీమాంతర ఉగ్రవాదం కొనసాగింపును పాకిస్థాన్ ఒక హక్కుగా భావిస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు.

కాబుల్‌తో చర్చలు విఫలం కావడానికి భారత్ కారణమని పాకిస్థాన్ ఆరోపించడంపై జైశ్వాల్ తీవ్రంగా స్పందించారు. ఆప్ఘాన్ తన సొంత భూభాగాన్ని పాలించుకోవడంపై పాకిస్థాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోందని, సీమాంతర ఉగ్రవాదాన్ని యథేచ్ఛగా కొనసాగించే హక్కు ఉందని పాక్ భావిస్తున్నట్లు ఉందని అన్నారు. ఈ చర్యలను పొరుగు దేశాలు ఆమోదించవని స్పష్టం చేశారు. ఆఫ్ఘాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, స్వాతంత్య్రానికి భారత్ కట్టుబడి ఉందని అన్నారు.

ఆఫ్ఘనిస్థాన్‌పై పాక్ ఈ నెల ప్రారంభంలో దాడులు జరిపింది. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకోగా, టర్కీ వేదికగా చర్చలు జరిగాయి. రెండు దేశాల మధ్య చర్చలు జరిగినప్పటికీ విఫలమయ్యాయి. ఈ అంశంపై పాకిస్థాన్ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందిస్తూ, భారత్ వైపు వేళ్ళు చూపించారు. తాలిబన్లను భారత్ నియంత్రిస్తోందని, వాళ్లు భారత్ చేతిలో కీలుబొమ్మలుగా మారారని ఆరోపించారు. ఆఫ్ఘన్‌తో చర్చలు విఫలం కావడానికి భారత్ కారణమని ఆరోపించారు.


More Telugu News