శ్రేయస్ అయ్యర్ ను ఆసుపత్రికి తరలించిన టీమిండియా మేనేజ్ మెంట్
- ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో శ్రేయస్ అయ్యర్‌కు గాయం
- అద్భుతమైన క్యాచ్ పట్టే క్రమంలో పక్కటెముకలకు గాయం
- వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు తెలిపిన బీసీసీఐ
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో 33వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో బ్యాటర్ అలెక్స్ కేరీ కొట్టిన బంతి గాల్లోకి లేచింది. బ్యాక్వర్డ్ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న అయ్యర్, పరిగెత్తుతూ డైవ్ చేసి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. అయితే, ఈ క్రమంలో కిందపడటంతో అతడి ఎడమ పక్కటెముకలకు గాయమైంది.
క్యాచ్ పట్టిన వెంటనే అయ్యర్ నొప్పితో విలవిలలాడాడు. టీమ్ ఫిజియో కమలేష్ జైన్, సహచర ఆటగాళ్ల సహాయంతో అయ్యర్ మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత మళ్లీ ఫీల్డింగ్‌కు రాలేదు. "ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో శ్రేయస్ అయ్యర్ ఎడమ పక్కటెముకలకు గాయమైంది. గాయం తీవ్రతను అంచనా వేయడానికి అతడిని ఆసుపత్రికి తరలించాం" అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
కీలక సమయంలో అతను గాయపడటం టీమిండియాకు ఎదురుదెబ్బగా మారింది. రాబోయే నెలల్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌తో స్వదేశంలో వన్డే సిరీస్‌లు ఉన్న నేపథ్యంలో అతని ఫిట్నెస్ జట్టుకు కీలకం కానుంది.