ఎగుమతుల మోత మోగిస్తున్న మారుతి సుజుకి 'జిమ్నీ'

  • భారత్ నుంచి లక్ష దాటిన జిమ్నీ 5-డోర్ ఎస్‌యూవీ ఎగుమతులు
  • వందకు పైగా దేశాలకు ఎగుమతి 
  • జపాన్‌లో 'జిమ్నీ నొమాడ్' పేరుతో విడుదల... అనూహ్య స్పందన
  • ఇది మేక్ ఇన్ ఇండియాకు గర్వకారణం అన్న మారుతి సీఈవో
భారత ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి, 'మేక్ ఇన్ ఇండియా' స్ఫూర్తితో మరో కీలక మైలురాయిని అందుకుంది. భారత్‌లో తయారై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న జిమ్నీ 5-డోర్ ఎస్‌యూవీ ఎగుమతులు లక్ష యూనిట్లను దాటినట్లు కంపెనీ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇది భారత తయారీ రంగానికి గర్వకారణంగా నిలుస్తోంది.

2023లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన కొద్దికాలానికే జిమ్నీ 5-డోర్ ఎస్‌యూవీ అంతర్జాతీయ ప్రయాణాన్ని ప్రారంభించింది. భారత్‌లో ప్రత్యేకంగా తయారవుతున్న ఈ వాహనాన్ని జపాన్, మెక్సికో, ఆస్ట్రేలియా వంటి 100కు పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ముఖ్యంగా, నాణ్యతకు అధిక ప్రాధాన్యతనిచ్చే జపాన్ మార్కెట్లోనూ జిమ్నీ సత్తా చాటుతోంది. అక్కడ 'జిమ్నీ నొమాడ్' పేరుతో ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఈ కారుకు అనూహ్య స్పందన లభించింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే 50,000కు పైగా ఆర్డర్లు రావడం విశేషం.

ఈ విజయంపై మారుతి సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో హిసాషి టేకుచి హర్షం వ్యక్తం చేశారు. "జిమ్నీ 5-డోర్ లక్ష ఎగుమతుల మార్కును దాటడం మాకు గర్వకారణం. ఈ ఎస్‌యూవీపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లు చూపిన నమ్మకానికి మేం కృతజ్ఞతలు తెలుపుతున్నాం" అని ఆయన అన్నారు. జిమ్నీ ఆఫ్-రోడ్ సామర్థ్యం, నమ్మకమైన పనితీరు, నాణ్యత వందకు పైగా దేశాల్లో ప్రశంసలు అందుకున్నాయని ఆయన తెలిపారు.

జిమ్నీ విజయంతో పాటు మారుతి సుజుకి మొత్తం ఎగుమతులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలోనే కంపెనీ 2 లక్షలకు పైగా వాహనాలను ఎగుమతి చేసి, 40 శాతం వృద్ధిని నమోదు చేసింది. భారత ప్రయాణికుల వాహనాల ఎగుమతుల్లో మారుతి సుజుకి ప్రస్తుతం 46 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది. ఇది ప్రపంచస్థాయి ఆటోమొబైల్ తయారీ కేంద్రంగా భారత్ ఎదుగుదలకు నిదర్శనమని కంపెనీ పేర్కొంది.


More Telugu News