రైల్వే స్టేషన్‌లో దారుణం.. సమోసా డబ్బుల కోసం ప్రయాణికుడిపై దాష్టీకం... వైరల్ వీడియో ఇదిగో!

  • జబల్‌పూర్ రైల్వే స్టేషన్‌లో అమానుష ఘటన
  • సమోసాల కోసం వెళ్లగా కదిలిన రైలు
  • ప్రయాణికుడిని అడ్డగించిన వ్యాపారి
  • ఆన్‌లైన్ పేమెంట్ ఫెయిల్ కావడంతో గొడవ
  • చేతి వాచీ లాక్కొని సమోసాలు ఇచ్చిన వైనం
  • వెండర్ల మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు
రైల్వే స్టేషన్లలో కొందరు వెండర్ల అరాచకాలకు అద్దం పట్టే ఓ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో చోటుచేసుకుంది. కదులుతున్న రైలు ఎక్కబోతున్న ఓ ప్రయాణికుడిని అడ్డగించిన సమోసా వ్యాపారి, డబ్బులు చెల్లించలేదన్న కారణంతో అతని చేతి గడియారాన్ని బలవంతంగా లాక్కున్నాడు. ఈ అమానవీయ సంఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే, ఓ ప్రయాణికుడు రైలు ఆగిన సమయంలో జబల్‌పూర్ స్టేషన్‌లోని ఓ దుకాణంలో సమోసాలు కొనేందుకు వెళ్లాడు. అయితే, అతను కొనుగోలు చేసేలోపే రైలు కదలడం ప్రారంభించింది. దీంతో సమోసాలు కొనకుండానే రైలు ఎక్కేందుకు అతను ప్రయత్నించాడు. ఇది గమనించిన వ్యాపారి అతడిని అడ్డగించాడు.

సమోసాలు కొని, డబ్బులు చెల్లించిన తర్వాతే వెళ్లనిస్తానని పట్టుబట్టాడు. దీంతో చేసేది లేక ప్రయాణికుడు ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించడానికి ప్రయత్నించాడు. కానీ సాంకేతిక కారణాల వల్ల ఆన్‌లైన్ పేమెంట్ విఫలమైంది. దీంతో ఆగ్రహానికి గురైన వ్యాపారి, ప్రయాణికుడి చేతికి ఉన్న వాచీని బలవంతంగా లాక్కుని, ఆ తర్వాత అతనికి సమోసాలు ఇచ్చి పంపించాడు.

ఈ ఘటనతో ప్రయాణికుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. రైల్వే స్టేషన్లలో ఇలాంటి వెండర్ మాఫియా నడుస్తోందని, ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఇలాంటి వారిపై రైల్వే అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఈ తతంగాన్ని అక్కడే ఉన్న ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది.

ఈ వీడియో పశ్చిమ మధ్య రైల్వే అధికారుల దృష్టికి వెళ్ళింది. వెంటనే స్పందించిన వారు, ప్రయాణికుడి వాచీ లాక్కున్నారనే ఆరోపణలపై విక్రేత సందీప్ గుప్తాను గుర్తించారు. "జబల్‌పూర్ స్టేషన్‌లో ఓ విక్రేత ప్రయాణికుడి నుంచి వాచీ లాక్కున్న ఘటన మా దృష్టికి వచ్చింది. వెంటనే చర్యలు తీసుకుని, ఆ విక్రేతను గుర్తించాం. రైల్వే చట్టం కింద కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశాం" అని పశ్చిమ మధ్య రైల్వే సీపీఆర్ఓ హర్షిత్ శ్రీవాస్తవ మీడియాకు తెలిపారు. అంతేకాకుండా, సందీప్ గుప్తా లైసెన్సును కూడా రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.



More Telugu News