తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఉద్యోగుల వేతనంలో కోత విధించి, వారి ఖాతాలో వేస్తాం: రేవంత్ రెడ్డి హెచ్చరిక

  • శిల్ప కళావేదికలో జరిగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్య
  • తల్లిదండ్రులను పట్టించుకోకపోతే 15 శాతం వరకు కోత విధిస్తామని వెల్లడి
  • తల్లిదండ్రులు, పుట్టి పెరిగిన ఊరును అభివృద్ధి చేసుకోవడం మన బాధ్యత అన్న ముఖ్యమంత్రి
తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల వేతనంలో 10 నుంచి 15 శాతం కోత విధించి ఆ మొత్తాన్ని వారి తల్లిదండ్రుల ఖాతా జమ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ శిల్ప కళావేదికలో జరిగిన కార్యక్రమంలో గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తల్లిదండ్రులు, పుట్టి పెరిగిన ఊరును అభివృద్ధి చేసుకోవడం మన బాధ్యత అని అన్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉంటారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే, ఉద్యోగుల జీతం వారి ఖాతాలో జమ అయిన వెంటనే, కొంత మొత్తాన్ని వారి తల్లిదండ్రుల ఖాతాలో వేసేలా చట్టం తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు.

శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి, ఈషాన్ రెడ్డి, యాదయ్య లాంటి యువ విద్యార్థులు తమ ప్రాణాలను అర్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. వేలాదిమంది విద్యార్థులు విశ్వవిద్యాలయాల్లో ఉంటూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు. కానీ నాటి రాజకీయ పార్టీల నాయకులు నీళ్లు, నిధులు, నియామకాలనే నినాదాన్ని, తెలంగాణ ప్రజల బలమైన ఆకాంక్షను ఆయుధంగా మార్చుకుని పదేళ్లు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించారని అన్నారు. నిరుద్యోగ సమస్యను పట్టించుకోలేదని ఆరోపించారు.

గత పాలనలో వారి కుటుంబ సభ్యులు, బంధు వర్గాన్ని శ్రీమంతులుగా చేయడం కోసమే పదేళ్లు పరిపాలన సాగిందని అన్నారు. ప్రజల గురించి ఆలోచించి ఉంటే కాళేశ్వరం కూలేశ్వరం అయి ఉండేది కాదని అన్నారు. లక్ష కోట్ల రూపాయలతో కట్టిన ప్రాజెక్టు మూడేళ్లకే కూలిన ఘటన ప్రపంచంలో ఎక్కడా జరగలేదని అన్నారు. తన ఫామ్ హౌస్‌లో ఎకరా పంటపై రూ. 1 కోటి ఆదాయం వస్తుందని ఒక పెద్దాయన చెప్పారని అన్నారు. ఎకరాకు కోటి ఆదాయం వచ్చే విద్యను, యువత, ప్రజలకు ఎందుకు నేర్పించలేదని ప్రశ్నించారు.


More Telugu News