పవిత్ర క్షేత్రంలో అనూహ్య గిఫ్ట్.. ఉద్యోగుల చేతికి చికెన్ మసాలా ప్యాకెట్లు!

  • మహారాష్ట్రలోని పంఢర్‌పూర్ విఠల్ ఆలయంలో ఘటన
  • దీపావళి కానుకగా ఉద్యోగులకు చికెన్ మసాలా పంపిణీ
  • సెక్యూరిటీ గార్డులు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి కూడా ఇదే గిఫ్ట్
  • పవిత్ర ఆలయంలో ఇలాంటి కానుక ఇవ్వడంపై విమర్శలు
  • సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యవహారం
దీపావళి పండుగ సందర్భంగా కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్‌లు, బహుమతులు అందించి వారిని సంతోషపెట్టడం సాధారణమే. కొన్ని సంస్థలు స్వీట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇస్తుంటే, మరికొన్ని కార్లు, బంగారం వంటి ఖరీదైన కానుకలు కూడా ఇస్తున్నాయి. అయితే, మహారాష్ట్రలోని ఓ ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఉద్యోగులకు ఇచ్చిన దీపావళి గిఫ్ట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రలోని పంఢర్‌పూర్‌లో ఉన్న ప్రఖ్యాత విఠల్ ఆలయ యాజమాన్యం తమ సిబ్బందికి దీపావళి కానుకలు అందించింది. ఇందులో భాగంగా ఆలయంలో పనిచేసే సెక్యూరిటీ గార్డులు, ఇతర ఉద్యోగులతో పాటు ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి కూడా చికెన్ మసాలా ప్యాకెట్లను బహుమతిగా పంపిణీ చేశారు.

పూర్తిగా శాకాహార వాతావరణం ఉండే పవిత్రమైన ఆలయంలో మాంసాహారానికి సంబంధించిన మసాలా ప్యాకెట్లను కానుకగా ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయం బయటకు తెలియడంతో స్థానికంగా పెద్ద చర్చ మొదలైంది. ఆలయ అధికారుల నిర్ణయంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. పవిత్ర స్థలంలో ఇలాంటి బహుమతులు ఇవ్వడం ఎంతవరకు సబబు అని పలువురు ప్రశ్నిస్తున్నారు.


More Telugu News