నాగార్జున సినిమాలో మరో హీరోయిన్ ఫిక్స్!

  • తెరకెక్కనున్న నాాగార్జున 100వ చిత్రం
  • ఇప్పటికే టబును ఖరారు చేసినట్టు సమాచారం
  • మరో హీరోయిన్ కోసం అనుష్కతో చర్చలు
కింగ్ అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో ఓ కీలక మైలురాయికి చేరువవుతున్నారు. ఆయన 100వ సినిమాపై టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును కొత్త దర్శకుడు ఆర్ కార్తీక్ భారీ స్థాయిలో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో నాగార్జున సరసన ఇద్దరు స్టార్ హీరోయిన్లు నటించనున్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది. సీనియర్ నటి టబుతో పాటు స్వీటీ అనుష్క శెట్టి కూడా ఈ సినిమాలో భాగం కానున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు 'లాటరీ కింగ్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

ఈ సినిమా పూర్తిస్థాయి పొలిటికల్ డ్రామాగా ఉండబోతోందని, ముఖ్యమంత్రి పదవి చుట్టూ కథనం సాగుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఈ చిత్రంలో నాగార్జున ద్విపాత్రాభినయం చేయనున్నారని కూడా అంటున్నారు. ప్రధాన హీరోయిన్‌ పాత్ర కోసం మొదట నయనతారను సంప్రదించినా, చివరికి టబును ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పుడు మరో కీలకమైన పాత్ర కోసం అనుష్క శెట్టితో చిత్రబృందం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే, చాలా కాలం తర్వాత నాగార్జున, టబు, అనుష్కలను ఒకే సినిమాలో చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కుతుంది.

ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ చిత్రంలో నాగార్జున కుమారులు నాగచైతన్య, అఖిల్ కూడా ప్రత్యేక అతిథి పాత్రల్లో కనిపించనున్నారని చెబుతున్నారు. ఒకే సినిమాలో అక్కినేని కుటుంబానికి చెందిన ముగ్గురు హీరోలు కనిపిస్తే అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. ఈ వార్తలపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.


More Telugu News