ప్యాట్ కమిన్స్ ఆల్-టైమ్ జట్టు.. విరాట్ కోహ్లీకి దక్కని చోటు!

  • ఇండియా-ఆస్ట్రేలియా ఆల్-టైమ్ జట్టును ప్రకటించిన ప్యాట్ కమిన్స్
  • కమిన్స్ జట్టులో సచిన్ టెండూల్కర్, ధోనీ, జహీర్ ఖాన్‌లకు మాత్రమే స్థానం
  • రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా లాంటి స్టార్లను విస్మరించిన ఆసీస్ కెప్టెన్
  • జట్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లకే పెద్దపీట వేసిన కమిన్స్
  • కీలక సిరీస్‌కు ముందు ఇది మైండ్ గేమ్‌లో భాగమేనన్న విశ్లేషణలు
క్రికెట్ ప్రపంచంలో భారత్-ఆస్ట్రేలియా సిరీస్ అంటే ఎప్పుడూ ప్రత్యేకమే. మైదానంలో ఆటగాళ్ల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లతో కూడిన తన ఆల్-టైమ్ అత్యుత్తమ జట్టు (ఎలెవన్)ను ప్రకటించిన కమిన్స్, అందులో ఆధునిక క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీకి చోటు కల్పించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఆస్ట్రేలియా గడ్డపై సైతం పరుగుల వరద పారించి, ఆ జట్టుకు కొరకరాని కొయ్యగా మారిన కోహ్లీని కమిన్స్ పక్కనపెట్టడం సంచలనం సృష్టిస్తోంది. స్టార్ స్పోర్ట్స్ కోసం నిర్వహించిన ఒక ప్రోమో షూట్‌లో కమిన్స్ తన జట్టును వెల్లడించారు. ఈ జట్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లదే పూర్తి ఆధిపత్యం కనిపించింది. భారత్ నుంచి కేవలం ముగ్గురు దిగ్గజాలకు మాత్రమే ఆయన స్థానం కల్పించారు. అందులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, మాజీ పేసర్ జహీర్ ఖాన్ ఉన్నారు.

అయితే, విరాట్ కోహ్లీతో పాటు ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాలను కూడా కమిన్స్ తన జట్టులోకి తీసుకోలేదు. కీలకమైన సిరీస్ అక్టోబర్ 19న పెర్త్‌లో ప్రారంభం కానున్న తరుణంలో, ప్రత్యర్థి జట్టుపై మానసిక ఒత్తిడి పెంచేందుకే కమిన్స్ ఈ రకమైన ఎంపిక చేశారని, ఇది మైండ్ గేమ్‌లో భాగమేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్యాట్ కమిన్స్ ఎంచుకున్న జట్టు: డేవిడ్ వార్నర్, సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, స్టీవెన్ స్మిత్, షేన్ వాట్సన్, మైఖేల్ బెవన్, ఎంఎస్ ధోనీ, షేన్ వార్న్, బ్రెట్ లీ, జహీర్ ఖాన్, గ్లెన్ మెక్‌గ్రాత్.


More Telugu News