సామాన్యులకు షాకిస్తున్న బంగారం ధర.. రూ.1.26 లక్షలు దాటి సరికొత్త రికార్డు

  • హైదరాబాద్‌లో రూ. 1,26,070 పలికిన బంగారం ధర
  • రూ. 1,16,750 వద్ద కదలాడిన 22 క్యారెట్ల బంగారం
  • బంగారం బాటలోనే దూసుకెళుతున్న వెండి ధర
బంగారం ధరలు ఇటీవల కాలంలో రోజురోజుకు సరికొత్త గరిష్ఠ స్థాయిని నమోదు చేస్తున్నాయి. ఒక్క రోజేలోనే రూ. 2 వేలకు పైగా పెరిగి రూ. 1,26,000 దాటింది. బుధవారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,26,070 గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,16,750 వద్ద కొనసాగింది.

అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఒక ఔన్సు బంగారం ధర మొదటిసారిగా 4 వేల డాలర్ల మార్కును దాటి రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1.58 లక్షలుగా ఉంది.

అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ షట్ డౌన్, ఆ దేశ ఆర్థిక పరిస్థితిపై నెలకొన్న అనిశ్చితులు బంగారం ధర అంతకంతకూ పెరగడానికి ప్రధాన కారణాలని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వడ్డీ రేట్లను ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ఇంకా తగ్గిస్తుందన్న అంచనాల నడుమ, పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారంపై మదుపు చేస్తున్నారు. డాలర్ మారకంతో పోల్చుకుంటే రూపాయి విలువ క్షీణించడం మన వద్ద బంగారం ధర మరింత ఖరీదుగా మారడానికి కారణమవుతోంది.

అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల కారణంగా బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. రెండేళ్లలో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర రెండింతలు అయింది. దాదాపు రెండేళ్ల క్రితం 2 వేల డాలర్ల దిగువన ఉన్న పసిడి ధర ఇప్పుడు 4 వేల డాలర్లు దాటింది. ఈ క్యాలెండర్ సంవత్సరంలోనే దాదాపు 50 శాతం పెరిగింది. ఇటీవల బంగారం ధర రోజురోజుకూ ఆకాశాన్నంటుతుండటంతో కొనుగోలుదారులు వెనుకడుగు వేస్తున్నారు.


More Telugu News