స్పామ్ కాల్స్ విసిగిస్తున్నాయా.. ఇలా చేసి చూడండి

  • డీఎన్డీ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన ట్రాయ్
  • ప్రమోషనల్ కాల్స్, మెసేజ్ లను కట్టడి చేసుకునే వీలు
  • అనవసరం అనుకున్న వాటినే బ్లాక్ చేసుకునే సదుపాయం
ఆఫీసులోనో లేక ఏదైనా పనిలో ఉన్నప్పుడో ప్రమోషనల్ కాల్ వస్తే కలిగే చిరాకు అంతా ఇంతా కాదు.. ఒక్కసారి కాదు రోజంతా ఇలాంటి కాల్స్ వస్తూనే ఉంటాయి. లోన్ కావాలా.. క్రెడిట్ కార్డు కావాలా.. రియల్ ఎస్టేట్ కొత్త వెంచర్ లో ఫ్లాట్ కావాలా అంటూ పదే పదే ఫోన్లు వస్తుంటే విసుగు కలగకమానదు. ఇలాంటి ఫోన్ కాల్స్ ను కట్టడి చేయడానికి ఆన్ లైన్ లో కనిపించే యాప్ లను డౌన్ లోడ్ చేసుకుంటే సైబర్ మోసాల బారిన పడే ప్రమాదం ఉంది.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఈ స్పామ్ కాల్స్ కట్టడికి ‘డు నాట్ డిస్టర్బ్’ ఆప్షన్ కల్పించింది. మొబైల్‌ నుంచి 1909కి సందేశం పంపడం లేదా కాల్‌ చేయడం ద్వారా వీటిని కట్టడి చేసే అవకాశం ఉంది. అయితే, దీనివల్ల అవసరమైన కాల్స్ కూడా రావు. ఈ నేపథ్యంలోనే ట్రాయ్ ‘డు నాట్ డిస్టర్బ్ (డీఎన్డీ)’ యాప్ ను అందుబాటులో తీసుకొచ్చింది. ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని స్పామ్ కాల్స్, మెసేజ్ లు అన్నింటినీ కాకుండా అనవసరమని భావించే వాటిని మాత్రమే బ్లాక్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఉన్న యాప్‌లో మనకు నచ్చని వాటిని బ్లాక్‌ చేసే, ఫిర్యాదు చేసేందుకు ఆస్కారం ఉంది.

గూగుల్‌ ప్లే స్టోర్‌ లేదా ఉమంగ్, యాప్‌ స్టోర్‌ నుంచి డీఎన్డీ యాప్ ను డౌన్ లోడ్‌ చేసుకోవాలి. ఫోన్‌ నంబరుతో లాగిన్‌ అయ్యాక డాష్‌బోర్డ్‌ ఓపెన్‌ అవుతుంది. ‘ఛేంజ్‌ ప్రిఫరెన్స్‌’ ఆప్షన్‌లోకి వెళ్తే అక్కడ మీరు వద్దనుకునే కాల్స్ ను ఎంచుకోవచ్చు. ‘డీఎన్డీ కేటగిరీ’లో బ్యాంకింగ్, ఆర్థికానికి సంబంధించినవి, ఇన్సూరెన్స్, క్రెడిట్‌ కార్డులు, రియల్‌ ఎస్టేట్, విద్య వంటి కొన్ని రకాల కాల్స్‌ను బ్లాక్‌ చేయడానికి అనుమతులు కనిపిస్తాయి. ‘ఫ్రాడ్‌ కాల్స్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి మోసపూరిత కాల్స్, సందేశాలపై ఫిర్యాదు చేయవచ్చు.


More Telugu News