ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. ఆహారం, ఉపాధి కావాలంటే మహిళలు కోరిక తీర్చాల్సిందే!

  • గాజాలోని ప్రలు యుద్ధంతో నలిగిపోతున్నారని అంతర్జాతీయ మీడియా వెల్లడి
  • ఆహారం, ఉపాధి కోసం చూస్తున్న మహిళలు లైంగిక దోపిడీకి గురవుతున్నారని ఆందోళన
  • 38 ఏళ్ల మహిళకు ఎదురైన అనుభవాన్ని వెల్లడించిన మీడియా
ఇజ్రాయెల్-హమాస్ పోరులో గాజా ప్రజలు తీవ్రంగా నలిగిపోతున్నారు. వారు అత్యంత దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. నిలువ నీడలేక, తినడానికి తిండి దొరకక మానవతా సహాయంపై ఆధారపడుతున్నారు. తమ పిల్లలకు తిండి పెట్టాలని, ఏదైనా పని దొరుకుతుందేమోనని ఎదురు చూస్తున్న మహిళలు లైంగిక దోపిడీకి గురవుతున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఈ మేరకు 38 ఏళ్ల మహిళకు ఎదురైన అనుభవాన్ని కొన్ని కథనాలు పేర్కొన్నాయి. తన ఆరుగురు పిల్లల ప్రాణాలను కాపాడుకోవాలని చూస్తున్న ఆ మహిళకు ఎయిడ్ ఏజెన్సీలో ఉపాధి కల్పిస్తామని ఒక వ్యక్తి హామీ ఇచ్చి తీసుకువెళ్లినట్లు ఆ కథనాలు వెల్లడించాయి.

ఆ వ్యక్తి తనను ఖాళీగా ఉన్న ఇంటికి తీసుకు వెళ్లాడని, ఆ చోటు నుండి తాను ఎప్పుడు బయటపడతానా అని పదేపదే అనుకున్నానని ఆమె మీడియాకు తెలిపింది. ఆ వ్యక్తి తనకు 30 డాలర్లకు సమానమైన నగదును ఇచ్చాడని, కానీ ఎలాంటి ఉపాధి కల్పించలేదని వాపోయింది. తమకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని ఆరుగురు మహిళలు మీడియాకు తమ గోడును వెళ్లబోసుకున్నారు.

ఆహారం, డబ్బు, ఉపాధి పేరిట తమను లొంగదీసుకున్నారని వారు చెప్పారు. కొంతమంది పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పినట్లు వెల్లడించారు. కల్లోలిత ప్రాంతాల్లో మహిళలు ఇలాంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కోవడం కొత్తేమీ కాదని మానవహక్కుల కార్యకర్తలు తెలిపారు. ఇలాంటి మానవతా సంక్షోభాలు ప్రజలను దుర్భరంగా మారుస్తాయని, వాటి పర్యావసానాల్లో లైంగిక హింస పెరగడం కూడా ఒకటని హ్యూమన్ రైట్స్ వాచ్ ప్రతినిధి హీథర్ బార్ ఆందోళన వ్యక్తం చేశారు. గాజా మహిళలు, బాలికల దయనీయ పరిస్థితిని వెల్లడించడానికి మాటలు కూడా రావడం లేదని విచారం వ్యక్తం చేశారు. సహాయం పొందేందుకు లైంగిక దోపిడీకి గురైన మహిళలకు తాము చికిత్స అందిస్తున్నామని పాలస్తీనాకు చెందిన సైకాలజిస్టులు తెలిపారు.


More Telugu News