Chandrababu Naidu: జనాభా తగ్గితే నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం: సీఎం చంద్రబాబుబు

Chandrababu Naidu Warns South India Faces Loss in Constituency Redraw if Population Declines
  • జనాభా నియంత్రణ కాదు.. ఇప్పుడు నిర్వహణే ముఖ్యం: అసెంబ్లీలో చంద్రబాబు
  • ఒకరు వద్దు.. ముగ్గురు ముద్దు.. మారిన పరిస్థితులకు తగ్గట్టు కొత్త నినాదం
  • రాష్ట్రంలో ఫెర్టిలిటీ రేటు 1.5కి పడిపోవడం భవిష్యత్తుకు ప్రమాదకరమని వెల్లడి
  • ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ‘తల్లికి వందనం’ అందిస్తామని ప్రకటన
  • తెలుగు జాతి శక్తిమంతంగా ఉండాలంటే జనాభా 5 కోట్లకు తగ్గకూడదని ఉద్ఘాటన
గతంలో జనాభా పెరిగితే ఏమవుతుందో అని ఆందోళన చెందాను. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల రీత్యా విధానాలు మార్చుకున్నాం... అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి అసెంబ్లీ వేదికగా పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ప్రకటనపై జరిగిన చర్చలో సీఎం సుదీర్ఘంగా ప్రసంగించారు. ఒకప్పుడు జనాభా నియంత్రణే పరమావధిగా భావించిన తాము, నేడు జనాభా నిర్వహణ (పాపులేషన్ మేనేజ్ మెంట్) వైపు ఎందుకు అడుగులు వేయాల్సి వచ్చిందో సవివరంగా తెలియజేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో టోటల్ ఫెర్టిలిటీ రేట్ (టీఎఫ్ఆర్) ప్రమాదకర స్థాయిలో 1.5కి పడిపోయిందని సీఎం గణాంకాలతో సహా వివరించారు. ఇదే ధోరణి కొనసాగితే దక్షిణాది రాష్ట్రాల్లో నెగెటివ్ గ్రోత్ నమోదవుతుందని, భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) జరిగితే రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకునే జనాభా నిర్వహణ విధానాన్ని తెరపైకి తెచ్చామన్నారు.

గతంలో మాల్తూషియన్ థియరీ ప్రకారం జనాభా విపరీతంగా పెరిగితే ప్రకృతి వైపరీత్యాలు, కరవు కాటకాలు వస్తాయనే భయం ఉండేదని, అందుకే ఆనాడు కఠినమైన జనాభా నియంత్రణ చర్యలు చేపట్టామని చంద్రబాబు గుర్తు చేశారు. 96-97 ప్రాంతంలో ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ కోసం 'బ్రేక్ సైలెన్స్' అంటూ ప్రచారాలు నిర్వహించామని, ఆర్ధిక సంస్కరణలు, సాంకేతిక విప్లవం, కుటుంబ నియంత్రణ చర్యలతో సామాజికంగా ఎన్నో విజయాలు సాధించామని తెలిపారు. అయితే, నాడు తీసుకున్న ఆ చర్యల ఫలితంగా ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారైందని, ప్రస్తుతం జనాభా తగ్గుదల అనేది కొత్త సవాలుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

"ఇప్పుడు ఒకరు వద్దు.. ఇద్దరు ఒకే.. ముగ్గురు ముద్దు" అనే కొత్త నినాదాన్ని తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని చంద్రబాబు పేర్కొన్నారు. చైనా కేవలం ఒక్క సంతానం విధానంతో ఇప్పుడు వృద్ధాప్య జనాభాతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోందని ఉదహరించారు. ఈ క్రమంలోనే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 'తల్లికి వందనం' పథకం వర్తింపజేస్తామని ప్రకటించారు. కుటుంబంలో ఎక్కువ మంది సభ్యులు ఉండేలా, మైక్రో ఫ్యామిలీస్ స్థానంలో ఉమ్మడి కుటుంబాల వ్యవస్థను ప్రోత్సహించేలా ప్రభుత్వ విధానాల్లో మార్పులు చేస్తామన్నారు. పెద్ద కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఎక్కువ ప్రోత్సాహకాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

సమాజంలో వస్తున్న మార్పులపైనా సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో బాల్య వివాహాలు సమస్యగా ఉండేవని, ఇప్పుడు ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం వల్ల సంతానలేమి సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. యాంత్రిక జీవనం వల్ల మానసిక ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయని అన్నారు. పేదలు, గిరిజనుల్లో జననాల రేటు బాగానే ఉన్నా, ఆర్ధికంగా స్థిరపడిన కుటుంబాల్లో (ఏపీఎల్) పిల్లలను కనడం తగ్గిపోయిందని విశ్లేషించారు. ప్రపంచంలో మహిళలకు అత్యంత గౌరవం ఇచ్చే దేశం భారతదేనని, ఎన్డీయే హయాంలోనే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు రాబోతున్నాయని గుర్తు చేశారు.

వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని ప్రధాని మోదీ, కేంద్ర ఆర్ధిక మంత్రి ఆర్ధికంగా ఆదుకున్నారని, ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ దూరదృష్టితో ఈ పాపులేషన్ పాలసీని తీసుకువస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగు జాతి శక్తిమంతంగా నిలవాలంటే ఏపీ జనాభా 5 కోట్లకు తగ్గకుండా నిర్వహించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. రాబోయే 30-40 ఏళ్లలో సమాజంలో సుస్థిరత, సంపద సృష్టి జరగాలంటే ఇప్పుడే సరైన పునాదులు వేయాలని పిలుపునిచ్చారు. ఈ పాలసీపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలు స్వీకరించి, అవసరమైన మార్పులతో పకడ్బందీగా అమలు చేస్తామని, ఈ చారిత్రక సంకల్పానికి ప్రజలందరూ సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Population Management
Fertility Rate
AP Politics
South India
Constituency Delimitation
Demographics
Telugu News
TFR Rate

More Telugu News