మహిళల ప్రపంచకప్‌లో భారత్ బోణీ.. శ్రీలంకపై ఘనవిజయం

  • మహిళల ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై 59 పరుగుల తేడాతో భారత్‌కు గెలుపు
  • 124 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియా
  • దీప్తి శర్మ, అమన్‌జోత్‌ కౌర్‌ అర్ధసెంచరీలతో ఆదుకున్న వైనం
  • బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అదరగొట్టిన దీప్తి.. అరుదైన రికార్డు
  • భారత బౌలర్ల ధాటికి 211 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుతమైన బోణీ కొట్టింది. నిన్న‌ శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో 59 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం-డీఎల్ఎస్‌) ఘన విజయం సాధించింది. ఒక దశలో 124 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును ఆల్‌రౌండర్లు దీప్తి శర్మ, అమన్‌జోత్‌ కౌర్‌, స్నేహ్ రాణా తమ ప్రదర్శనతో గట్టెక్కించారు. బ్యాట్‌తో అర్ధసెంచరీ చేసి, బంతితో మూడు వికెట్లు పడగొట్టిన దీప్తి శర్మ, ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.

వర్షం కారణంగా 47 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, శ్రీలంక బౌలర్ ఇనోక రణవీర (4/46) దెబ్బకు కుదేలైంది. కేవలం రెండు ఓవర్ల వ్యవధిలో నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పతనం అంచున నిలిచింది. ఈ క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ (53), అమన్‌జోత్‌ కౌర్‌ (57) అద్భుతంగా పోరాడారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 99 బంతుల్లో 103 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. ఆఖర్లో స్నేహ్ రాణా కేవలం 15 బంతుల్లోనే 28 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో భారత్ 8 వికెట్ల నష్టానికి 269 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది.

అనంతరం 271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు కట్టడి చేశారు. దీప్తి శర్మ (3/54) బంతితోనూ మాయ చేయగా, స్నేహ్ రాణా (2/32) పొదుపుగా బౌలింగ్ చేసి కీలక వికెట్లు తీశారు. శ్రీ చరణి కూడా రెండు వికెట్లతో రాణించడంతో శ్రీలంక 45.4 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌట్ అయింది. లంక జట్టులో కెప్టెన్ చామరి ఆటపట్టు (43) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్ల క‌ట్టుదిట్టమైన బౌలింగ్‌కు తోడు, శ్రీలంక ఫీల్డర్లు పలు క్యాచ్‌లు నేలపాలు చేయడం కూడా టీమిండియా విజయానికి కార‌ణ‌మైంది. ఈ గెలుపుతో ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భారత్ శుభారంభం చేసింది.


More Telugu News