పాకిస్థాన్‌పై గెలవాలనే కసితో ఆడా.. నా కెరీర్‌లోనే ఆ ఇన్నింగ్స్ ప్రత్యేకం: తిలక్ వర్మ

  • పాక్ ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి గురిచేశారన్న తిలక్ వర్మ
  • దేశాన్ని గెలిపించడమే లక్ష్యంగా ఆడానని స్పష్టీక‌ర‌ణ‌
  • ఆసియా కప్ ఫైనల్ బ్యాటింగ్ కెరీర్‌లోనే విలువైంద‌న్న తెలుగు క్రికెట‌ర్‌
  • తన విజయం వెనుక తల్లిదండ్రులు, కోచ్ కృషి ఎంతో ఉందని వెల్ల‌డి
  • లింగంపల్లి మైదానంలో అభిమానులతో ముచ్చటించిన తెలుగు తేజం
ఆసియా కప్ ఫైనల్ లాంటి కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు తనను తీవ్రమైన ఒత్తిడికి గురిచేశారని, అయితే వాటన్నింటినీ పక్కనపెట్టి బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నానని భారత యువ క్రికెటర్, తెలుగు తేజం తిలక్ వర్మ వెల్లడించాడు. దేశం కోసం ఆడుతున్నప్పుడు ఇలాంటి ఒత్తిళ్లు సహజమేనని, వాటిపై కాకుండా లక్ష్యంపైనే తన దృష్టిని కేంద్రీకరించినట్లు తెలిపాడు.

హైదరాబాద్‌లోని లింగంపల్లిలోని లేగల స్పోర్ట్స్ ఎరీనా మైదానంలో అభిమానులతో ముచ్చటించిన సందర్భంగా తిలక్ వర్మ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్‌ ఫైనల్‌లో చేసిన బ్యాటింగ్ తన కెరీర్‌లోనే ఎంతో విలువైందని ఆయన అభిప్రాయపడ్డాడు. జట్టు సభ్యులందరి సమష్టి కృషితోనే విజయం సాధ్యమైందని స్పష్టం చేశాడు.

తన క్రికెట్ ప్రయాణంలో ఈ స్థాయికి రావడానికి తన తల్లిదండ్రులు, కోచ్ అందించిన ప్రోత్సాహమే కారణమని, చిన్నప్పటి నుంచి వారు తన కోసం ఎంతో కష్టపడ్డారని తిలక్ వర్మ పేర్కొన్నాడు. తాను బ్యాటింగ్ మెళకువలు నేర్చుకున్నది ఇదే మైదానంలో అని గుర్తుచేసుకున్నాడు. ఈ సందర్భంగా తనను చూసేందుకు వచ్చిన అభిమానులు, యువ క్రీడాకారులతో తిల‌క్‌ కరచాలనం చేసి, వారితో సరదాగా గడిపాడు.


More Telugu News