గాజా శాంతికి ట్రంప్ ప్లాన్... స్వాగతించిన ప్రధాని మోదీ

  • గాజా యుద్ధం ముగింపునకు ట్రంప్ 20 సూత్రాల ప్లాన్
  • ట్రంప్ చొరవను స్వాగతించిన ప్రధాని మోదీ
  • హమాస్ ఒప్పుకుంటే 72 గంటల్లో బందీల విడుదల
  • తిరస్కరిస్తే ఇజ్రాయెల్‌కు పూర్తి స్వేచ్ఛ ఇస్తామని ట్రంప్‌ హెచ్చరిక
  • గాజాలో తాత్కాలిక ప్రభుత్వం, అంతర్జాతీయ పర్యవేక్షణ
  • ట్రంప్ ప్లాన్‌కు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మద్దతు
గాజాలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన శాంతి ప్రణాళికను భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ ప్రతిపాదన పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రజలకు దీర్ఘకాలిక శాంతి, భద్రతను అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పశ్చిమాసియా ప్రాంతంలో సుస్థిరతకు ఈ ప్లాన్ దోహదపడుతుందని పేర్కొన్నారు.

మంగళవారం వైట్‌హౌస్‌లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అయిన అనంతరం ట్రంప్ ఈ 20 సూత్రాల శాంతి ప్రణాళికను అధికారికంగా వెల్లడించారు. దీనిపై ప్రధాని మోదీ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించారు. "గాజా వివాదాన్ని ముగించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సమగ్ర ప్రణాళికను మేం స్వాగతిస్తున్నాం. ఇది పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రజలతో పాటు పశ్చిమాసియా ప్రాంతానికి దీర్ఘకాలిక శాంతి, భద్రత, అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుంది" అని ఆయన తన పోస్టులో తెలిపారు. ట్రంప్ చొరవకు అందరూ మద్దతివ్వాలని ఆయన కోరారు.

హమాస్‌కు ట్రంప్, నెతన్యాహు హెచ్చరిక
ఈ ప్రణాళికను హమాస్ అంగీకరిస్తే యుద్ధం ముగిసి, బందీలు విడుదలవుతారని ట్రంప్ తెలిపారు. "హమాస్ ఈ ఒప్పందాన్ని చేసుకోవాలని కోరుకుంటున్నట్టు నాకు సమాచారం ఉంది" అని ఆయన అన్నారు. అయితే, ఈ ప్రతిపాదనను హమాస్ తిరస్కరిస్తే, వారిని అంతం చేసేందుకు ఇజ్రాయెల్‌కు తన పూర్తి మద్దతు ఉంటుందని ఆయన గట్టిగా హెచ్చరించారు. ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా పునరుద్ఘాటించారు. తమ యుద్ధ లక్ష్యాలను సాధించేలా ఈ ప్లాన్ ఉందని, హమాస్ ఒప్పుకోకపోతే పని పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ట్రంప్ ప్రతిపాదించిన ప్రణాళికలోని అంశాలివే..
ట్రంప్ ప్రతిపాదించిన ఈ ప్లాన్ ప్రకారం, గాజాలో తాత్కాలికంగా ఒక టెక్నోక్రాట్ ప్రభుత్వం ఏర్పడుతుంది. హమాస్ ఒప్పందానికి అంగీకరిస్తే 72 గంటల్లోగా బందీలందరినీ విడుదల చేయాలి. గాజా పునర్నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు ట్రంప్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ వంటి సభ్యులతో 'బోర్డ్ ఆఫ్ పీస్' అనే అంతర్జాతీయ సంస్థ ఏర్పాటవుతుంది. శాంతికి కట్టుబడిన హమాస్ సభ్యులకు క్షమాభిక్ష లభిస్తుంది, మిగిలిన వారికి ఇతర దేశాలకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తారు. ప్రాంతీయ, అంతర్జాతీయ దళాలు గాజాలో భద్రతను పర్యవేక్షిస్తాయి.


More Telugu News