పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమా టిక్కెట్ ధరలను వెంటనే తగ్గించాలి: తెలంగాణ పోలీసు శాఖ ఆదేశాలు

  • సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు ఆదేశాలు
  • .టిక్కెట్ ధరల పెంపును హైకోర్టు సస్పెండ్ చేయడాన్ని పేర్కొన్న జీవో
  • ఇటీవలే విడుదలైన ఓజీ చిత్రం
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'ఓజీ' చిత్రం టిక్కెట్ ధరల పెంపును తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ జీవో విడుదల చేసింది. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన టిక్కెట్ ధరల పెంపును తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసిన విషయాన్ని, తదనంతర పరిణామాలను జీవోలో ప్రస్తావించింది.

చిత్రం విడుదల సందర్భంగా ప్రీమియర్ షో ప్రదర్శనతో పాటు, సినిమా విడుదలైన సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

ప్రభుత్వం జారీ చేసిన ఈ మెమోను సవాల్ చేస్తూ మహేశ్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ఈ నెల 24న ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. సినిమా టిక్కెట్ రేట్లపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ 26న స్టే విధించింది.

రివ్యూ పిటిషన్‌పై ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం టిక్కెట్ ధరలు పెంచడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని హైకోర్టు తేల్చి చెప్పింది. తదుపరి విచారణను అక్టోబర్ 9వ తేదీకి వాయిదా వేస్తూ, టిక్కెట్ ధరలు ఎందుకు పెంచాలనుకుంటున్నారో వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.


More Telugu News